ఇతర రాష్ట్రాల్లోనూ పశు వైద్య రథాలు 

18 Jan, 2023 05:46 IST|Sakshi
ఏపీ తరహాలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం డిజైన్‌ చేసిన మొబైల్‌ అంబులేటరీ క్లినిక్‌ వాహనాలు

సాక్షి, అమరావతి: మూగ జీవాల ఆరోగ్య సంరక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యమిస్తూ 108 అంబులెన్స్‌ల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జార్ఖండ్‌లో ఇప్పటికే వీటిని అందుబాటులోకి తీసుకురాఆ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెలాఖరు నాటికి సేవలందించనున్నాయి. పంజాబ్‌లో టెండర్లు పిలవగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. 

వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు     
దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు వైద్య సేవలందించే సంకల్పంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున తొలి విడతలో 175 వైఎస్సార్‌ సంచార పశు వైద్యసేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్స్‌ల తయారీతో పాటు రెండేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.133.13 కోట్లు ఖర్చు చేస్తోంది. గతేడాది మే 19న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీటి సేవలను ప్రారంభించి టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962తో అనుసంధానించారు.

ప్రత్యేకంగా రూ.7 కోట్లతో కాల్‌ సెంటర్‌ నెలకొల్పారు. మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు చిన్నపాటి సర్జరీలు అక్కడే నిర్వహించేలా తీర్చిదిద్దారు. అంబులెన్స్‌లో మినీ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. వెయ్యి కిలోల బరువున్న జీవాలను సునాయాసంగా తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్‌ జాక్‌ లిఫ్ట్‌ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌తో పాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌ కమ్‌ కాంపౌండర్, ఒక  వైద్యుడిని నియమించారు. 

1.72 లక్షల మూగ జీవాలకు సేవలు 
ఫోన్‌ కాల్‌ వచ్చిన అరగంటలోపే మూగ జీవాలకు వైద్యసేవలు అందిస్తూ అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 3.52లక్షల ఫోన్‌కాల్స్‌ రాగా, వాహనాలు 1.20లక్షల ట్రిప్పులు తిరిగాయి. 2,127 ఆర్బీకేల పరిధిలో 1.72లక్షల మూగ, సన్నజీవాలకు గత 8 నెలలుగా సేవలందిస్తున్నాయి. రెండో విడతలో రూ.119.18 కోట్లతో మరో 165 అంబులెన్స్‌లను ఈ నెలాఖరుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

సర్వత్రా ప్రశంసలు 
అంబులెన్స్‌లలో సమకూర్చిన సౌకర్యాలు, అందిస్తున్న సేవలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అధికారుల బృందాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇదే తరహాలో సంచార పశు వైద్య సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికి ఒకటి చొప్పున  ఏర్పాటు చేస్తే ఆర్థిక చేయూతనిస్తామని ప్రకటించడంతో పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టాయి.

కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్‌ రాష్ట్ర బృందాలు ఏపీలో పర్యటించి వీటి సేవలపై అధ్యయనం చేశాయి. మన రాష్ట్రంలో సమర్ధంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈఎంఆర్‌ఐ) గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థకే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో వాహనాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.  

సీఎం ఆలోచనలు స్ఫూర్తిదాయకం 
సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనల నుంచి పుట్టినవే మొ­బైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌. మూగజీవాలకు సైతం నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో తెచ్చిన వీటి సేవలను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు పోటీపడుతుండడం గర్వ కారణం. 
– డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖమంత్రి 

పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి.. 
ఏపీ తరహాలో అంబులెన్స్‌­లు ప్రవేశపెట్టి నిర్వహణ బా­ధ్యతలు అప్పగించేందుకు పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ మాతో కలసి పని చేసేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయి. 
– ఎస్‌.రామకృష్ణవర్మ, ఈఎంఆర్‌ఐ ఆపరేషన్స్‌ ఏపీ స్టేట్‌ హెడ్‌  

మరిన్ని వార్తలు