ఫ్యాషన్‌.. యాక్షన్‌.. అదే యాంబిషన్‌

6 Dec, 2021 08:09 IST|Sakshi

మోడలింగ్, సినీ రంగాల్లో నాగేంద్ర  

అమలాపురం: చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్‌ రంగమంటే అతనికి ప్రాణం.. యాక్టింగ్‌ అంటే ఇష్టం.. ఈ రెండింటిలో స్థిరపడాలన్నదే లక్ష్యం.. అందుకే బీటెక్‌ పూర్తి చేసినా ఉద్యోగం కోసం చూడకుండా తన టాలెంట్‌తో నచ్చిన రంగాల్లో ప్రతిభ చాటాలని అమలాపురానికి చెందిన మేడిద నాగేంద్ర అడుగులు వేస్తున్నారు. మోడలింగ్‌లో తన కలలు సాకారం చేసుకుంటున్నారు. ఆ రంగంలో వేసిన అడుగులు విజయవంతమై అతనిని విజేతను చేయడమే కాకుండా అవార్డు వరించింది. ఇక సినిమా రంగంలో తొలి అడుగు ఇటీవలే పడింది. హీరోగా ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నటిస్తున్నారు. కళాశాల విద్య నుంచే నాగేంద్ర మోడలింగ్, సినీ రంగాలపై దృష్టి పెట్టారు. కళాశాలలో ఏ వేడుక జరిగినా అతని డ్యాన్స్‌తో అదరగొట్టేవారు. కొడుకు తాను ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న తీరును చూసి తల్లిదండ్రులూ స్వాగతిస్తున్నారు.  

చిన్న చిన్నగా ఎదుగుతూ..  
మోడలింగ్‌లో చిన్న చిన్న షోలకు వెళ్లి నాగేంద్ర ర్యాంప్‌పై వాక్‌ చేసేవారు. 2020 జనవరిలో హైదరాబాద్‌లో టాలింటికా సంస్థ నిర్వహించిన ఫ్యాషన్‌ పోటీల్లో తన అదిరేటి డ్రస్‌తో సౌత్‌ ఇండియా టాప్‌ మోడల్‌గా నిలిచారు. ఈ సంస్థ ఎంపిక చేసిన టాప్‌ 10 విజేతల్లో ఒకరిగా తొలి విజయం నమోదు చేసుకున్నారు. గత అక్టోబర్‌లో గోవాలో జరిగిన జాతీయ ఫ్యాషన్‌ మోడలింగ్‌లో మిస్టర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పోటీలకు ఆంధ్ర రాష్ట్రం తరఫున హాజరయ్యారు. అక్కడ విజేత కాకపోయినా మోడలింగ్‌లో అదీ జాతీయ పోటీల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా... అంతా అభినందిస్తున్నారు.

నాగేంద్ర ప్రతిభను గుర్తించి హైదరాబాద్‌ బిజినెస్‌ మింట్‌ సంస్థ ఈ నెల 27న నిర్వహించిన నేషన్‌ వైడ్‌ అవార్డ్స్‌–2021 వేదికపై ఇన్‌స్పైరింగ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ప్రదానం చేసింది. సినీ హీరో కావాలన్న ఆకాంక్షతో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ యాక్షన్‌ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా సంస్థలో శిక్షణ, మెళకువలు నేర్చుకున్నారు. దీంతో లోలుగు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో హీరోగా నటించే దక్కింది. పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ కథాంశంతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్నం, లంపసింగ్‌ ప్రాంతాల్లో జరుగుతోంది. ‘మాలి’ అనే చిత్రంలో నెగెటివ్‌ పాత్రను పోషిస్తున్నారు. అమలాపురం వైఎస్సార్‌ సీపీ నాయకుడు మేడిద రమేష్‌బాబు కుమారుడు నాగేంద్ర. 

ప్రతిభ, శ్రమనే నమ్ముకున్నా.. 
నేను ఎంచుకున్న మోడలింగ్, సినిమా రంగాల్లో రాణించగలననే నమ్మకం ఉంది. నాకు ఎవరి సిఫార్సులూ లేవు. నా వెనుక ఆ రెండు రంగాలకు సంబంధించి పెద్దలూ లేరు. కేవలం నా ప్రతిభ, క్రమశిక్షణ, శ్రమనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. దీనిని ఓ చాలెంజ్‌గా తీసుకుని ముందడుగు వేస్తున్నా.                    
– మేడిద నాగేంద్ర, 
మోడల్, సినీ నటుడు, అమలాపురం

మరిన్ని వార్తలు