వాయుగుండంగా మారనున్న అల్పపీడనం? 

12 Sep, 2021 05:26 IST|Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్‌ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వెల్లడించింది.

అయితే కోస్తా తీరానికి సమీపం నుంచి కదులుతుండటంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌ రెండో వారం వరకూ వర్షాలు పడే సూచనలున్నాయనీ.. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.  

మరిన్ని వార్తలు