నేడు, రేపు తేలికపాటి వర్షాలు

7 Oct, 2021 03:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కేరళ వరకూ సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఇదిలావుండగా.. నైరుతి రుతుపవనాల తిరోగమనం వాయువ్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి బుధవారం ప్రారంభమైంది. మరోవైపు.. ఉత్తర అండమాన్‌ సముద్ర తీరంలో ఈ నెల 10వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది.

ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 14 లేదా 15వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పరిగిలో 64.5 మి.మీ., బాడంగిలో 58.5, హిందూపూర్‌లో 49, లేపాక్షిలో 46.5, కర్నూలులో 40, గొల్లపాడులో 38.5, గజపతినగరంలో 37.5, మార్కాపురం, ఓర్వకల్లులో 37, బొబ్బిలిలో 34.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు