నేడు, రేపు మోస్తరు వర్షాలు

18 Nov, 2020 04:56 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉపరితల ద్రోణి వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. కొమరిన్‌ ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు తీరం వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి పశ్చిమ దిశగా ప్రయాణిస్తోంది. ఇది మాల్దీవుల నుంచి ఆగ్నేయ ఆరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణిలో విలీనమైందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో (బుధ, గురువారాల్లో) ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మేఘాలు ఆవరించడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని తెలిపారు. మంగళవారం చీమకుర్తి (ప్రకాశం)లో 7 సెం.మీ., సూళ్లురుపేట (నెల్లూరు), తడ (నెల్లూరు)లో 6, ఒంగోలు, దర్శిలో 5, అర్ధవీడు(ప్రకాశం), నెల్లూరులలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు