2 రోజుల పాటు తేలిక పాటి జల్లులు

6 Dec, 2020 03:46 IST|Sakshi

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 

సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని రామనాథపురం జిల్లా తీరానికి దగ్గర్లోని మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 33 గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా ఉంది. రామనాథపురానికి నైరుతి దిశలో 40 కి.మీ దూరంలో, పాంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం ఉదయం అదే ప్రాంతంలో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో సత్యవేడులో 10 సెం.మీ, సూళ్లూరుపేటలో 6, గూడూరు, తడలో 5, రాపూరు, కోడూరు, తొట్టంబేడులో 4, వెంకటగిరి, శ్రీకాళహస్తి, నగరిలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

తమిళనాడులో 26 మంది మృతి 
దక్షిణ తమిళనాడును భయపెట్టిన బురేవి తుపాను తీరానికి చేరకుండానే బలహీనపడి ఊరటనిచ్చింది. అయితే తుపాను ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోగా, పది లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం సంభవించింది.  

మరిన్ని వార్తలు