రూ.600 కోట్లతో 3 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ 

18 Apr, 2022 05:20 IST|Sakshi

విజయవాడ, తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రణాళిక 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రైల్వేస్టేషన్లను మల్టీమోడల్‌ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్లను అందుకోసం ఎంపిక చేసింది. మొదట పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ భావించింది. కానీ ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడంతో సొంత నిధులతో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఇటీవల ఆమోదించింది. వీటి అభివృద్ధికి రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. దీనిపై రైల్వే డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తుది ఆమోదం తెలిపితే తదుపరి ప్రక్రియను చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. వచ్చే మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని భావిస్తున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి.  

ఆధునికీకరణ, వసతులకు ప్రాధాన్యం 
గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, ఇండోర్‌ గేమ్స్‌ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి. కానీ ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లకు కొత్తరూపు ఇవ్వడం, ప్రయాణికుల వసతులు మెరుగుపరచడం వంటి పనులతోపాటు భద్రతకు ప్రాధాన్యమివ్వనున్నారు. అందుకోసం ప్రయాణికులకు వసతులు, ఇంటర్‌మోడల్‌ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్‌ సెక్యూరిటీ, ఆహ్లాదకర అంశాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, రైల్వే సమాచార వ్వవస్థ అనే ఆరు కేటగిరీల కింద అభివృద్ధి చేయనున్నారు.  

రైల్వే స్టేషన్లలో కల్పించనున్న వసతులు 
► ప్రాంత విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్‌కు కొత్తరూపు తీసుకొస్తారు. 
► రైల్వేస్టేషన్‌ ప్రాంగణాన్ని ఇంటిగ్రేటెడ్‌ సెక్యూరిటీ సిస్టంతో అనుసంధానిస్తారు. సీసీ కెమెరాలు, లగేజీ స్కానింగ్‌ వ్యవస్థ, మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటుతోపాటు రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బందిని నియమిస్తారు. రైల్వేస్టేషన్‌ ప్రాంగణాన్ని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు.  
► స్టేషన్‌లోనే ఇంటర్‌ఫేసెస్, స్వైపింగ్‌ టికెట్‌ మెషిన్లు, డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటు.  
► అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఎస్కలేటర్లు, ప్రధాన ద్వారం వద్ద తగినన్ని ఎలివేటర్లను ఏర్పాటు చేస్తారు. బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతారు. 
► ఇంటర్‌మోడల్‌ కనెక్టివిటీ కారిడార్‌ ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోనే సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోరిక్షాల కోసం మల్టీమోడల్‌ ట్రాన్సిట్‌ హబ్‌ను నెలకొల్పుతారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ నుంచి ఆ ప్రత్యేక మార్గంలో బయటకు వచ్చి బస్‌స్టేషన్, విమానాశ్రయంతోపాటు ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. విశాలమైన పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. 
► రైల్వేస్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫాంలను విశాలంగా తీర్చిదిద్దుతారు. ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు. మందుల దుకాణాలు, రిటైల్‌ దుకాణాలు, ఏటీఎంలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు.  

మరిన్ని వార్తలు