మామిడి కాపు బాగుంది.. కరోనా కాటేసింది

4 Jun, 2021 19:57 IST|Sakshi

మొగల్తూరు మామిడిపై కోవిడ్‌ ప్రభావం

ఎగుమతులు లేక ధర పతనం

వరుసగా రెండో ఏడాదీ రైతులకు నష్టాలు

నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): సముద్ర తీరంలో ఇసుక నేలలో పండే మొగల్తూరు మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. మామిడి రకాల్లో ఈ రకం రుచి మధురంగా ఉండటంతో దీనికోసం ఆహారప్రియులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. డిమాండ్‌ అధికంగా ఉండటంతో మొగల్తూరు మామిడి ధరలు అదేస్థాయిలో ఉంటాయి. ధర, ఎగుమతులు బాగుండటంతో సాగు చేసిన రైతులు లాభాలను గడిస్తుంటారు. అయితే రెండేళ్లుగా మొగల్తూరు మామిడి రైతుల పరిస్థితి మారింది. కరోనా ప్రభావంతో కాపు బాగున్నా స్థానికంగా బేరాలు లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపు ఎగుమతులు తగ్గడంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. మిగిలిన రకాలతో పోలిస్తే ఇవి ఆలస్యంగా కాపు కాస్తారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. ప్రస్తుతం మొగల్తూరు ప్రాంతంలో మామిడి తోటలు పండ్లతో కళకళలాడుతున్నాయి.  

గిరాకీ బాగు
మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దాదాపు 600 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పండ్ల రకాలైన బంగినపల్లి, చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొత్తపల్లి కొబ్బరి, పచ్చళ్ల రకాలైన సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లు రకాలకు డిమాండ్‌ ఉంది.  ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. జిల్లాలోని దూర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి పండ్లు, కాయలు కొంటుంటారు. 

రైతులే వ్యాపారులై..
సాధారణంగా మామిడి తోటలకు మచ్చతెగులు, మంచు తెగులు వంటి వ్యాధులు సోకి రైతులు ఇబ్బందులు పడతారు. ఈదురుగాలులతో పిందెలు, కాయలు రాలిపోయి ఇబ్బంది పడతారు. అయితే ఈ సీజన్‌లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.  పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టును రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో ముందుగా రైతులకు, వ్యాపారులకు మధ్య బేరసారాలు పెద్దగా జరగలేదు. దీంతో రైతులే నేరుగా వ్యాపారుల అవతారం ఎత్తి అమ్మకాలు ప్రారంభించారు. 


ఎగుమతులు లేక..
రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ మార్కెట్‌కు మొగల్తూరు మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. సీజన్‌లో సుమారు 150 లారీల వరకు సరుకు ఎగుమతి చేస్తుంటారు. సీజన్‌లో మామిడి పండ్లు పరక (13 కాయలు) రూ.500 ధర పలుకుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గింది. ప్రస్తుతం పరక కాయలు రూ.200 లోపు ధర పలుకుతున్నాయి.  

అయినకాడికి అమ్ముకుంటూ..
నాకు ఎకరా మామిడి తోట ఉండగా మరో రెండెకరాలను రూ.2 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. ఇప్పుడు ఎగుమతులు లేకపోగా స్థానిక మార్కెట్లు కూడా పెద్దగా సాగడం లేదు. దీంతో అయినకాడికి కాయలు అమ్ముకుంటున్నాం. గతంలో ఇక్కడి బంగినపల్లి కాయ ఒకటి రూ.50 ధర పలకగా ప్రస్తుతం రూ.20 కూడా లేని పరిస్థితి. చాలా మంది నేరుగా తోటల్లోకి వచ్చి కాయలు కొనుక్కుని దూర ప్రాంతాల్లో ఉండే తమ బంధువులకు పంపేవారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు లేవు. 
– అయితం నాగేశ్వరరావు, రైతు మొగల్తూరు

కాపు బాగా కాసింది 
ఈ ఏడాది కాపు చాలా బాగుంది. గతంలో కాపు సరిగా లేక, మరోపక్క తెగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లం. ఈసారి కాపు బాగుండటంతో తోటలతో ఆదాయం కూడా పెరుగుతుందని అనుకున్నాం. అయితే నిరాశ ఎదురైంది. మొగల్తూరులో రోజువారీ జరిగే మార్కెట్‌లో కూడా మామిడి పండ్లకు ధర రావడం లేదు. త యారైన పండ్లను చెట్లకు ఉంచలేక వచ్చిన ధరకు అమ్ముతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. గతంలో మొగల్తూరు మామిడి అంటే జనం ఎగబడేవారు.  
– వెల్లి సురేష్, రైతు, మొగల్తూరు   

మరిన్ని వార్తలు