కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు..

30 Jul, 2021 20:57 IST|Sakshi

కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు.. ప్రసవం చేస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు.. సొమ్ము ఇవ్వలేని నిరుపేదలను నీచంగా చూస్తున్నారు.. మాటలతోనే మనసును కుళ్లబొడుస్తున్నారు.. మానవత్వం మరిచి.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిబ్బందే, రాబందులై ప్రజలను పీక్కుతింటున్నారు.  

చిత్తూరు రూరల్‌: చిత్తూరు నగరంలోని జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం అధిక సంఖ్యలో పేదలే వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడువాసులు కూడా ప్రసవం కోసం ఇక్కడికే వస్తుంటారు. రోజుకు సగటున 25 నుంచి 30 కేసులు డెలివరీ కోసం వస్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అదేపనిగా డబ్బులు దండుకుంటున్నారు. 
వసూళ్లు ఇలా.. 
ప్రసూతి విభాగంలో ఉదయం, రాత్రి, అత్యవసరమైతే మధ్యాహ్న వేళల్లో ప్రసవం కోసం ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇక్కడ సిబ్బందిలో కొందరు బిడ్డను చూపించిన వెంటనే కాసులు అడుగుతున్నారు. అది కూడా రూ.1000 లేదా రూ.2000 అనుకుంటే పొరబాటే. ఏకంగా రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామీణులు, తమిళనాడు వాసులను టార్గెట్‌ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు.  ఆపరేషన్‌ అయిన వెంటనే బెడ్‌పైకి మార్చాలని, క్లీనింగ్‌ పేరు చెప్పి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. 
పురిటినొప్పులే నయం.. 
చిత్తూరు ఆస్పత్రికి ప్రసవానికొచ్చే వారికి పురిటినొప్పుల కంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది తీరుతో పడే ఇబ్బందులే అధికం అంటే అతిశయోక్తి కాదేమో. వారు అడిగిన డబ్బులిస్తే పని చేస్తారు. లేకుంటే డబ్బు కోసం పీడిస్తారు. ఇచ్చే వరకు దుర్భాషలాడుతారు. ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేనివాళ్లు ఎందుకొచ్చారంటూ.. తీవ్రంగా అవమానిస్తారు. డబ్బులిచ్చే వరకు జలగల్లా పట్టుకుంటారు. వారిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. 

4 పలమనేరుకు చెందిన కోకిల(19) కాన్పు కోసం తమిళనాడులోని వేలూరులో అరుకంబడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో గతవారం చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇక్కడ ఆపరేషన్‌ చేయడంతో ఆడబిడ్డ జన్మించింది. అయితే బిడ్డను చేతిలో పెట్టగానే ఆస్పత్రి సిబ్బంది కోకిల తల్లిని రూ.20 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.10 వేలు గుంజేశారు. బిడ్డను ఏమైనా చేస్తారేమో అని భయపడి డబ్బు ఇచ్చామని బాధితురాలు కంటతడి పెట్టింది. 

4 తిరుత్తణికి చెందిన అనిత(25) ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరి, ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యుల వద్ద కూడా సిబ్బంది రూ.10 వేలు లాగేశారు. అడిగినంత ఇస్తేనే.. మీ బిడ్డను బయటకు తెస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మాత్రం ఇవ్వలేని వారు మీకెందుకు బిడ్డలంటూ హేళన చేశారు. బాధితులు చేసేది లేక అప్పుచేసి.. వారికి అడిగినంతా ముట్టజెప్పారు.  

మరిన్ని వార్తలు