ఏపీ వాసులకు చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..

11 Jun, 2022 09:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ (రాయలసీమ)లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ఏపీలోకి విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పేర్కొంది. అలాగే మధ్య అరేబియా సముద్రం, గోవాలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తాయని పేర్కొంది.
చదవండి: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే..

రుతు పవనాలు ఏపీకి దగ్గరగా రావడం వల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గినట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు కార్వార్, చిక్‌మంగళూర్, బెంగళూర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు