సకాలంలోనే రుతుపవనాలు

18 May, 2021 04:43 IST|Sakshi

31 నాటికి కేరళను తాకనున్న నైరుతి 

జూన్‌ మొదటి వారంలో రాష్ట్రానికి రాక 

సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు ఈసారి కూడా సకాలంలోనే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భారతీయ వాతావరణశాఖ అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన ఖరీఫ్‌ సీజన్‌ (జూన్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు)లో కురిసే వర్షాలు నైరుతీ రుతుపవనాల ప్రభావంతో పడేవే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈనెల 31న రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూన్‌ 1కి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తుంటాయి. ఆరేబియా మహా సముద్రంలో ప్రస్తుతం ఏర్పడిన టౌటే తుపాను రుతుపవనాల రాకను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఈనెల 21 నాటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి రుతుపవనాల కదలికలు ప్రారంభం కావచ్చని అంచనా.

రుతుపవనాలకు ఒక నెల ముందు అరేబియా మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనాలో, తుపాన్లో ఏర్పడుతుంటాయి. వీటివల్ల రుతుపవనాల్లో కదలిక వస్తుంది. అయితే ఈసారి అరేబియా మహాసముద్రంలో తుపాను వల్ల ఇప్పటికే కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, గోవాలలో భారీవర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తప్ప మిగతా రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఆ సమయానికి కాస్త అటు ఇటుగా రుతుపవనాలు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది జూన్‌ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ప్రకటిస్తే జూన్‌ 5న ప్రవేశించాయి. ఈసారి మాత్రం జూన్‌ ఒకటికి ఒకరోజు ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. మే నెలలో అండమాన్‌లో వర్షాలు పడ్డాయంటే రుతుపవనాలు రాకడ ప్రారంభమైనట్టుగా భావిస్తుంటారు.

రాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి వానలు 
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి గుజరాత్‌ వైపు తేమ గాలులు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వచ్చే రెండురోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ప్రత్తిపాడులో 3 సెంటీమీటర్లు వంతున వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు