‘మత్స్యకారులకు ఆదాయం రావడం టీడీపీకి ఇష్టం లేదా?’

14 Sep, 2021 12:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చెరువులపై ఆధారపడి జీవించే వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం ఆశించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల ద్వారా చెరువుల నిర్వహణ చేపట్టామని, అందుకోసం వందల ఎకరాలు పైబడిన చెరువలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో చెరువులపై ఆధారపడి జీవించే వారి కోసం జీవో 217 తీసుకొచ్చామని తెలిపారు. 100 హెక్టర్స్ పైనున్న 28 చెరువులను దీని కిందకు తీసుకొచ్చాన్నారు. వాటిని అధ్యయనం చేసి సొసైటీ సభ్యులకు కనీసం రూ.15000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను ఆ జీవో కింద తీసుకున్నామని తెలిపారు.

ఈ వ్యవహారాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారని ప్రతిపక్షం గ్లోబల్ ప్రచారం చేస్తోందని మోపిదేవి మండిపడ్డారు. ఇది నెల్లూరు జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది అని జీవోలో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. అక్కడ అమలు చేసి మంచి ఫలితాలు వస్తే అప్పుడు ఆలోచించాలని భావించామని చెప్పారు. మత్సకారులకు ఆదాయం రావడం సంతోషమా కాదా అనేది టీడీపీ వారు చెప్పాలని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఏపీలో మత్స్యకారులకు అనేక పథకాలు పెట్టామని అన్నారు. లబ్ధిదారుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు.

డీజిల్ టీడీపీ హయాంలో రూ. 6 సబ్సిడీ ఉంటే తాము రూ. 9 చేశామని, ఎవరైనా మత్స్యకారుడు దురదృష్ట వశాత్తు చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ కూడా వచ్చేది కాదని, ఇప్పుడు వెంటనే 10 లక్షలు అందిస్తున్నామని మోపిదేవి తెలిపారు. ప్రతి జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పించారని తెలిపారు. ఫేజ్ 1 కింద 5 హార్బర్లు పనులు జరుగుతున్నాయని, ఫేజ్ 2 కింద కూడా మిగతావి ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.  పశ్చిమ గోదావరిలో మెరైన్ యూనివర్సిటీకి స్థలం కూడా కేటాయించారని తెలిపారు. 

మరిన్ని వార్తలు