ఏపీలో షిప్‌ రిపేరింగ్‌ యూనిట్‌! 

17 Nov, 2021 08:34 IST|Sakshi

 ఏర్పాటుకు మారిటైమ్‌ బోర్డు కసరత్తు 

శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు అనుకూలం 

షిప్‌ రిపేరింగ్‌–రీ సైక్లింగ్‌ క్లస్టర్‌తో 15 వేల మందికి ఉపాధి

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని ఆదాయ, ఉపాధి మార్గాలకు ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. తూర్పు తీర ప్రాంతంలో షిప్‌ రిపేరింగ్‌ యూనిట్‌ ఒక్కటీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడంపై దృష్టి సారించింది. మారిటైమ్‌ ఇండియా విజన్‌–2030లో భాగంగా షిప్‌ రిపేరింగ్, రీసైక్లింగ్‌ క్లస్టర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ మారిటైమ్‌ బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్లస్టర్‌కు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద్‌ సోనోవల్‌ను కోరింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ మారిటైమ్‌ అధికారులు వెల్లడించారు. 

షిప్‌ రిపేరింగ్‌–రీ సైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక షిప్‌ను రీసైక్లింగ్‌ చేయడానికి సగటున 300 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఉంటుంది. దీనిపై ఆధారపడి 50 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు అవుతాయని అంచనా. దీంతో పాటు 10 లక్షల టన్నుల ఉక్కును తుక్కుగా మార్చి అమ్మితే జీఎస్టీ రూపంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి రూ. 270 కోట్ల చొప్పున ఆదాయం సమకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,000కుపైగా ఓడలు, దేశంలో 300 వరకు ఓడలు రీసైక్లింగ్‌కు వెళుతున్నట్లు అంచనా. ప్రస్తుతం మన దేశంలో రీసైక్లింగ్‌ వ్యాపారంలో గుజరాత్‌ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని తూర్పు తీరప్రాంతంలో మన రాష్ట్రం అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.  

మరిన్ని వార్తలు