అనధికారిక సెలవులో 200 మందికిపైగా వైద్యులు

2 Mar, 2021 08:23 IST|Sakshi

విధులకు రాని వైద్యులపై శాఖాపరమైన చర్యలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వందలాది మంది వైద్యులు అనధికారిక సెలవుల్లో కొనసాగుతున్నారు. మరీ ముఖ్యంగా వైద్యవిధాన పరిషత్, బోధనాసుపత్రుల్లో కలిపి సుమారు 200 మంది స్పెషలిస్టు వైద్యులు గత కొన్నేళ్లుగా విధులకు హాజరు కానట్టు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. చాలామందిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. కొంతమంది ఏళ్లతరబడి విధులకు రాకుండా ఉండటం, ఏదో కారణం చూపి మళ్లీ చేరడం, కొద్ది రోజులు పనిచేసి మళ్లీ సెలవులో వెళ్లడం.. ఇదీ రివాజు. ముఖ్యంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ఎక్కువ మంది సెలవులో ఉన్నట్టు తేలింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 26 మంది వైద్యులు రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సెలవులో ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

ఎలాంటి కారణాలు లేకుండా, సమాచారమూ ఇవ్వకుండా ఏడాదిపాటు విధులకు హాజరుకాని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఓవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అవసరం ఎక్కువగా ఉంది. రోజుకు వందల్లో రోగులు వసూ్తంటారు. ఈ పరిస్థితుల్లో తమను ఎవరూ తీసెయ్యలేరన్న ధీమాతో చాలామంది కనీస సమాచారం లేకుండానే అనధికారికంగా విధులకు హాజరు కావడంలేదు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను వివరణ కోరగా.. ఎంతమంది అనధికారిక సెలవులో ఉన్నారన్నది తమ దృష్టికి రాలేదుగానీ, అలా అనధికారిక సెలవులో ఉన్న వారిపై శాఖాపరంగా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చదవండి:
హైడ్రామా: చంద్రబాబు ‘కపట’ దీక్ష
మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌  

మరిన్ని వార్తలు