Andhra Pradesh: కోటి మందికి రెండు డోసులు

14 Sep, 2021 03:20 IST|Sakshi

రాష్ట్రంలో ఇప్పటివరకు 3.51 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ 

ముమ్మరంగా కొనసాగుతున్న కోవిడ్‌ టీకాల ప్రక్రియ 

స్పెషల్‌ డ్రైవ్‌తో మూడు రోజుల్లో 28.63 లక్షల మందికి టీకాలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారితో తలపడుతూ రాష్ట్రంలో టీకాల యజ్ఞం ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 3.51 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైంది. ఇప్పటివరకు కోటి మందికి పైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. గత 3 రోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 28.63 లక్షల మందికిపైగా టీకాలిచ్చినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. రాష్ట్ర జనాభా మొత్తం 5.30 కోట్ల పైచిలుకు కాగా శరవేగంగా అర్హులందరికీ టీకాల కార్యక్రమం జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఆరోగ్యశాఖ సిబ్బంది టీకాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 
3.51 కోట్ల డోసులు పూర్తి 
ఇప్పటివరకూ రెండు డోసులూ 1,08,49,970 మందికి ఇచ్చారు. 1,34,51,311 మందికి సింగిల్‌ డోసు ఇచ్చారు. మొత్తం 2,43,01,281 మంది కనీసం ఒక డోసు లేదా రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇక 18 ఏళ్లు దాటిన వారికి, రెండో డోసు ఇవ్వాల్సిన వారికి వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా జరుగుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు మొదటి డోసు పూర్తయింది. వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి టీకా ప్రక్రియ రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు