నేలకు పులకింత

3 Aug, 2020 03:46 IST|Sakshi

రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో ఇప్పటికే సగానికి పైగా సాగు 

దాదాపు అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం 

ఇప్పటి వరకు 22 లక్షల హెక్టార్లలో పంటలు 

లక్ష్యానికి మించి వేరుశనగ సాగు 

6 లక్షలకు పైగా హెక్టార్లలో వరినాట్లు 

రాయలసీమలో భారీగా పెరిగిన సాగు 

అన్ని రకాలుగా కలిసొచ్చిన సంవత్సరం

సకాలంలో వర్షాలు కురుస్తుండటం, సొంతూరులోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇప్పటికే సగానికిపైగా విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. దీంతో ఈ ఖరీఫ్‌లో గ్రామాలు పచ్చదనం సంతరించుకుని కళకళలాడుతున్నాయి.   

సాక్షి, అమరావతి: తొలకరి పైర్లతో పుడమి కళకళలాడుతోంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్‌ సాగు విస్తీర్ణంలో ఇప్పటికే సగానికి పైగా నాట్లు పూర్తి అయ్యాయి. అదునులో కురుస్తున్న వానలు, సకాలంలో అందిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులో నాణ్యమైన విత్తనాలు.. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉండడం రైతన్నలకు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుండడంతో డెల్టా ప్రాంతాలకు సమృద్ధిగా నీరు వదులుతున్నారు. నైరుతి రుతుపవనాలకు అల్పపీడనాలు తోడుకావడంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 12 జిల్లాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో మాత్రం మామూలు స్థితిలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికి 212.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 328.3 మిల్లీమీటర్లు కురిసింది.  

22 లక్షల హెక్టార్లకు చేరిన సాగు
ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ఇప్పటికే దాదాపు 22 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ సీజన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 37.42 లక్షల హెక్టార్లు. మామూలుగా అయితే ఇప్పటికి 19 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంది. కానీ, అన్ని రకాల సానుకూల పరిస్థితుల నేపథ్యంలో అదనంగా రెండు లక్షల హెక్టార్లలో విత్తారు. గత ఏడాది ఇదే కాలానికి 13.98 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల్ని వేయడం గమనార్హం. 

6.23 లక్షల హెక్టార్లకు చేరిన వరిసాగు...
ఖరీఫ్‌ ప్రధాన పంటల్లో ఒకటైన వరి సాగు ఇప్పటికే 6.23 లక్షల హెక్టార్లకు చేరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో వరి 14.97 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ఇందులో ఇప్పటికి 6.23 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేశారు. గత ఏడాది ఇదే కాలానికి 4.81 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి సాగు కావడం గమనార్హం. ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టాలో వరినాట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ముందుగా వేసిన జొన్న, సజ్జ, మొక్కజొన్న పైర్లు ఏపుగా పెరుగుతున్నాయి. నాగార్జునసాగర్‌ కుడికాల్వకు త్వరలో నీటిని వదిలే అవకాశం ఉండడంతో రైతులు భూముల్ని సిద్ధం చేసుకుంటున్నారు. 

7లక్షల హెక్టార్లలో వేరుశనగ
ఇక రెండో అతిపెద్ద పంటయిన వేరుశనగ విత్తడం దాదాపు ముగింపు దశకు చేరింది. మామూలు సాగు విస్తీర్ణం 7.04 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే దాదాపు 7 లక్షల హెక్టార్లకు చేరింది. మొత్తంగా ఇప్పటివరకు ఆహార ధాన్యాల పంటలు 29 నుంచి 50 శాతం వరకు వేశారు. జొన్న, నువ్వు, సోయాబీన్, పత్తి, ఉల్లి పంటల సాగు 51 నుంచి 75 శాతం మధ్య, రాగి, వేరుశనగ పంటలు 76 నుంచి వంద శాతం మధ్య వేశారు. రాయలసీమ జిల్లాల్లో పంటల్ని విత్తడం తుది దశకు వచ్చింది. విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాలలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మిగతా అన్ని ప్రాంతాలలో పంటల్ని వేయడం ముమ్మరమైంది. ఇదిలా ఉంటే.. ముందుగా వేసిన వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు పంటలకు అక్కడక్కడా తెగుళ్లు సోకినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించి నివారణ చర్యలు సూచిస్తున్నారు. 

వేరుశనగ సస్యరక్షణ ఇలా...
► జూలై తొలి వారంలో విత్తిన వేరుశనగలో కలుపు నివారణ మందుల్ని పిచికారీ చేయకుంటే పంట 20–25 రోజుల వయసులో ఉన్నప్పుడు ఇమాజిత్‌ఫిర్‌ను ఎకరాకు 300 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లుకోవాలి
► రసం పీల్చే పురుగు, గొంగళి పురుగులను అరికట్టడానికి మోనోక్రోటోఫాస్‌ 320 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 
► మొదలు కుళ్లు (కాలర్‌ రాట్‌) ఎక్కువగా ఉంటే హెక్సాకొనజోల్‌ కూడా కలిపి పంటపై చల్లుకోవాలి. 
► 5 శాతం వేప గింజల కషాయాన్ని చల్లి రసం పీల్చే పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ పి.రాంబాబు రైతులకు సలహా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు