Home Isolation: హోం ఐసొలేషన్‌లోనే లక్ష మందికి పైగా

5 May, 2021 02:51 IST|Sakshi

తాజాగా కోవిడ్‌ కేర్‌ సెంటర్లవైపు మొగ్గు చూపుతున్న పేషెంట్లు

దీంతో ఆస్పత్రులపై తగ్గనున్న భారం.. 558 ఆస్పత్రుల్లో 44,559 పడకలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్‌ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీళ్లందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు 104 కాల్‌సెంటర్‌ వైద్యులు కూడా ఫోన్‌ ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మరోవైపు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 9,937 మంది బాధితులు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారు. ప్రస్తుతమున్న 1.50 లక్షల యాక్టివ్‌ కేసుల్లో 37,760 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య పెరిగితే.. ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌ లక్షణాలు బయటపడగానే జాప్యం చేయకుండా 104కు కాల్‌ చేసి మందుల వివరాలు తెలుసుకోవడం లేదంటే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రావాలని సూచిస్తున్నారు. మానసిక ఆందోళనతోనే చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారని అంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 558 ఆస్పత్రులు కోవిడ్‌ చికిత్స అందిస్తుండగా.. 44,559 పడకలు అందుబాటులో ఉన్నాయి.

ఆయాసం ఎక్కువ ఉంటేనే ఆస్పత్రులకు..
సాధారణ మందులు వాడి చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. మానసికంగా కుంగిపోవద్దు. ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లండి.  
–డా.సి.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వాస్పత్రి  

>
మరిన్ని వార్తలు