శక్తిమాన్‌..యువత

29 Jul, 2020 04:01 IST|Sakshi

కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో యువతే ఎక్కువ

హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారిలో కూడా వీరే అధికం

వ్యాధి నిరోధక శక్తే వారిని కాపాడుతోందని చెబుతున్న వైద్యులు

50 ఏళ్లు పైన ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలంటున్న నిపుణులు

వయసుతో సంబంధం లేకుండా కరోనా కాటేస్తోంది. ఈ వైరస్‌ యువతకు ఎక్కువగా సోకుతోంది. అయితే ఈ మహమ్మారిని యువత సమర్థంగా ఎదుర్కొంటోంది. పాజిటివ్‌ వచ్చినా స్వల్ప కాలంలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకెళ్తోంది. వారిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తే వారిని కరోనా నుంచి కాపాడుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆస్పత్రులకు వస్తే తప్ప మిగతా వాళ్లందరూ 10 రోజుల్లోపే ఆరోగ్యవంతులవుతున్నారని అంటున్నారు.

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను యువత దీటుగా ఎదుర్కొంటోంది. కరోనా సోకినా స్వల్ప కాలంలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకెళ్తోంది. వారిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తే వారిని కరోనా నుంచి కాపాడుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆస్పత్రులకు వస్తే తప్ప మిగతా వాళ్లందరూ 10 రోజుల్లోపే ఆరోగ్యవంతులవుతున్నారని అంటున్నారు. 50 ఏళ్లకు పైన ఉన్నవారికే కోలుకోవడానికి 14 రోజులు పడుతోందని పేర్కొంటున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే.. త్వరగా కోలుకుంటున్నవారు, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నవారిలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపువారే ఉన్నట్టు స్పష్టమైంది. దీర్ఘకాలిక జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో కొంతమంది కోలుకోవడం ఆలస్యమవుతోంది.

యువతలోనే ఎక్కువ పాజిటివ్‌ కేసులు..
► రాష్ట్రంలో ఎక్కువ కరోనా పాజిటివ్‌ కేసులు యువతకే వచ్చాయి.
► కోలుకున్నవారిలోనూ వీళ్లే ఎక్కువ.
► యాక్టివ్‌ కేసుల్లో 57.22 శాతం 40 ఏళ్ల లోపు వారివే.
► రికవరీలో 60 శాతం మంది యువతే.
► నిలకడగా ఆరోగ్యంగా ఉన్నవారిలో 47 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే
► పాజిటివ్‌ కేసుల్లో 4.11 శాతం మంది 10 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నారు.
► పాజిటివ్‌ కేసుల్లో 91 ఏళ్లు దాటినవారు 0.04 శాతం మంది ఉన్నారు.

ఆందోళన అనవసరం..
► కరోనా వైరస్‌ యువతను పెద్దగా ప్రభావితం చేయడం లేదని తేలింది.
► 60 ఏళ్లు దాటిన వారిని జాగ్రత్తగా కాపాడుకుంటే బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం
► 50 ఏళ్లు దాటి మధుమేహం, హైపర్‌టెన్షన్, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిని జాగ్రత్తగా చూడాలి.
► వైరస్‌ వ్యాప్తి ఉంది కాబట్టి వీరు ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండటం ఉత్తమం.
► ఆందోళన చెందకుండా అవసరమైతే 104 లేదా టెలీమెడిసిన్‌ 14,410 నంబర్లకు ఫోన్‌ చేస్తే సలహాలు, సూచనలు ఇస్తారు.
► స్థానిక వార్డు లేదా గ్రామ వలంటీర్‌లు, ఏఎన్‌ఎంలకు ఫోన్‌ చేస్తే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

50 ఏళ్లు దాటిన వారిపైనే దృష్టి
మన రాష్ట్రంలో కరోనా వచ్చినవారిలో 50–60 ఏళ్ల మధ్యవారు ఎక్కువగా మృతి చెందుతున్నారు. వీరిలో మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ బాధితులే ఎక్కువ. ఇలాంటి వారికి వైరస్‌ రాకుండా కాపాడుకోవాలి. వీరిపై కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. అప్రమత్తంగా ఉంటే యువతను కరోనా ఏమీ చేయలేదు. 
–డా.కె.ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు