కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఇంట్లోనే.. మూడేళ్లుగా బయటకు రాని తల్లీకూతుళ్లు.. అసలేం జరిగింది?

21 Dec, 2022 08:09 IST|Sakshi
తల్లీకూతుళ్లు. పక్కనే సూరిబాబు  

సాక్షి, కాకినాడ(కాజులూరు): మండలంలోని కుయ్యేరులో మానసిక అనారోగ్యంతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్ల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి అనారోగ్యం పాలవ్వటంతో విషయం తెలసుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు, స్థానికుల సహకారంతో బలవంతంగా వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలివీ.. కుయ్యేరు గ్రామ పంచాయతీ సమీపంలో నివాసముంటున్న కర్నిడి సూరిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు.

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అందరితోపాటు ఇంటికే పరిమితమైన అతని భార్య మణి, కూతురు దుర్గాభవాని మానసిక వ్యధతో నేటికీ బయటకు రాకుండా తలుపులు బిగించుకు ఉండిపోయారు. చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు వచ్చి పిలిచినా మీరు మాకు చేతబడి చెయ్యటానికి వచ్చారా.. అంటూ తలుపులు తియ్యకుండా లోపలి నుంచే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండేవారు.

దీంతో క్రమేపీ ఎవరూ వీరిని పలకరించటం మానేశారు. సూరిబాబు రోజూ కూరగాయల వ్యాపారానికి వెళ్లివస్తూ వీరికి అవసరమైన ఆహారం, వస్తువులు తెచ్చి ఇస్తున్నాడు. కొన్ని రోజులు అతని భార్య ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో సూరిబాబు తన భార్యకు వైద్యం అందించమని దుగ్గుదుర్రు పీహెచ్‌సీలో సిబ్బందిని కోరాడు.

చదవండి: (మళ్లీ అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ రెడీ)

మంగళవారం వైద్యసిబ్బంది వచ్చి పిలిచినా తలుపులు తియ్యలేదు. గ్రామ సర్పంచ్‌ పిల్లి కృష్ణమూర్తి, స్థానికుల సహకారంతో తులపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు.

అయితే తల్లి, కూతుళ్లు వైద్యానికి నిరాకరిస్తూ సిబ్బందిపై దాడి చేశారు. సర్పంచ్‌ పిల్లి కృష్ణమూర్తి ఫోన్‌లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణకు సమాచారమందించగా ఆయన ఆదేశాల మేరకూ గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భార్య, కుమార్తె మానసిక పరిస్థితి బాగోలేదని, ఎప్పటికైనా సరౌతుందనే భావనతో మూడేళ్లుగా ఎవ్వరికీ చెప్పలేదని భర్త సూరిబాబు తెలిపాడు. 

మరిన్ని వార్తలు