కరోనా మిగిల్చిన విషాదం..!

10 Aug, 2020 08:05 IST|Sakshi
పెద్ద కుమారుడు పవన్‌ కుమార్‌, ప్రమాదంలో మృతి చెందిన జయలక్ష్మి 

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో మృతి చెందిన తల్లీ కొడుకులు 

ఈనెల 5న కరోనా చికిత్స కోసం రమేష్‌ హాస్పిటల్‌లో చేరిక 

కుటుంబంలో మరో ఇద్దరికి పాజిటివ్

సాక్షి, ప్రకాశం: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబంలోని నలుగురు ఒకరి తరువాత ఒకరు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు మెరుగైన చికిత్స తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కరోనా నుంచి కోలుకుని నేడో రేపో ఇంటికి చేరుకుంటామని ఆశించినంతలోనే ఊహించని రీతిలో ఇద్దరిని అగ్నిప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఇదీ విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జయలక్ష్మి, పవన్‌కుమార్‌ కుటుంబంలోని విషాదగాథ.  (ప్రమాదానికి కారణమిదేనా?)

కందుకూరు పట్టణంలోని గణేష్‌నగర్‌లో నివాసం ఉండే దుడ్డు ప్రసాద్‌ ఎన్‌టీఆర్‌ బొమ్మ సెంటర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి మాల ధరించే భక్తులకు గురుస్వామిగా ప్రసిద్ధి. కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఆంజనేయస్వామి మాల ధరించే భక్తులందరూ ప్రసాద్‌ గురుస్వామి వద్దనే మాల తీసుకుంటారు. ఆ విధంగా ప్రసాద్‌ చాలా సుపరిచితుడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం తీసుకోవాలని విజయవాడ రమేష్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాడు. చికిత్స అనంతరం ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. అయితే ప్రసాద్‌ నుంచి వైరస్‌ ఆయన భార్య వెంకట జయలక్ష్మి (48), ఆయన పెద్దకుమారుడు పవన్‌కుమార్‌ (30), రెండో కుమారుడు మనోజ్‌కు సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది.  (మృత్యు కీలలు

అధికంగా లక్షణాలు ఉన్న వెంకట జయలక్ష్మి, పవన్‌కుమార్‌లు కూడా రమేష్‌ హాస్పిటల్‌లోనే జాయిన్‌ అయ్యారు. ఐదు రోజులుగా వారిని స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంబీబీఎస్‌ చదువుతున్న రెండో కుమారుడు మనోజ్‌కు మాత్రం లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు. రమేష్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జయలక్ష్మి, పవన్‌ కుమార్‌లు కూడా ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని అక్కడి వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి, కుమారుడు ఇద్దరూ మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా నుంచి కోలుకున్నా అగ్ని ప్రమాదం వాళ్ల పాలిట యమపాశంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌కుమార్‌ భార్య ఏడు నెలల గర్భిణి:   
అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పవన్‌కుమార్‌ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల ఇంటికి వచ్చి వర్క్‌ ఫ్రం హోం విధానంలో ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్‌కుమార్‌కు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక 7వ నెల గర్భిణి. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పవన్‌కుమార్‌ మృతితో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా కరోనా ఈ రెండు కుటుంబాల్లో అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఇక రెండో కుమారుడు మనోజ్‌ ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. కరోనా వైరస్‌ సోకడంతో ప్రస్తుతం కందుకూరు పట్టణంలోనే ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదంలో తల్లి, అన్న ఇద్దరూ మృతి చెందినా బయటకు రాలేని పరిస్థితిలో మనోజ్‌ తల్లడిల్లుతున్నాడు. 

మరిన్ని వార్తలు