కుమార్తె మృతిని తట్టుకోలేక చనిపోతామంటూ..

25 Apr, 2021 11:20 IST|Sakshi
అదృశ్యమైన నాగలక్ష్మి, సాయికిరణ్‌ (ఫైల్‌)

మనస్తాపంతో తల్లి, సోదరుడి అదృశ్యం

పోలీసులను ఆశ్రయించిన తండ్రి  

మంగళగిరి: పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి భవితను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశపడ్డ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. బీఈడీ చదివి సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్న కుమార్తె అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో తట్టుకోలేకపోయిన తల్లి, సోదరుడు తాము చనిపోతామంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తండ్రి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంగళగిరి పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో బుడ్డయ్యగారి వీధిలో నివాసముంటున్న పసుపులేటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు. శ్రీనివాసరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు.

కుమార్తె మహేశ్వరి బీఈడీ పూర్తి చేసి సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటుండగా కుమారుడు సాయికిరణ్‌ బీటెక్‌ చదువుతున్నాడు. ఇటీవల మహేశ్వరికి కామెర్ల వ్యాధి సోకగా, చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ శిక్షణకు వెళ్లి అక్కడ ఆకస్మికంగా మృతి చెందింది. సమాచారం అందుకున్న కుటుంబం అంతా విజయవాడ చేరుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తుండగా తల్లి, సోదరుడు అప్పుడే మనస్తాపానికి గురై తాము చనిపోతామని కన్నీరుమున్నీరయ్యారు.

దీంతో బంధువులు వారిని సముదాయించి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం మహేశ్వరి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం అందరూ ఇంటికి చేరుకోగా బంధువులంతా వెళ్లిపోవడంతో శ్రీనివాసరావు అలసిపోయి నిద్రకు ఉపక్రమించారు. తర్వాత లేచి చూసేటప్పటికి.. భార్య, కుమారుడు కనిపించకపోవడంతో బంధువులను, స్నేహితులను విచారించాడు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష   
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. 

>
మరిన్ని వార్తలు