కేంద్ర ఉక్కు సహాయ మంత్రికి ఉద్యమ సెగ

13 Feb, 2022 03:59 IST|Sakshi
ఆందోళనకారుడిని తరలిస్తున్న పోలీసులు

ట్రాన్సిట్‌ హాల్ట్‌ కోసం విశాఖ రాక

నిరసనలతో పర్యటనలో మార్పులు

మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేకు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమ సెగ తగిలింది. కులస్తే శనివారం కోల్‌కతా నుంచి విశాఖ మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంది. విజయవాడకు నేరుగా విమానం లేకపోవడంతో విశాఖలో దిగి, ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం విమానంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఉక్కు ఉద్యమకారుల ఆందోళనలతో ఆయన పర్యటనలో మార్పు జరిగింది. ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వద్ద ఓ ప్రైవేట్‌ హోటల్‌లోనే ఆయన బస చేశారు. కొద్దిసేపు స్టీల్‌ప్లాంట్‌ అధికారులు, బీజేపీ నేతలతో ఆయన మాట్లాడారు. అక్కడే విశ్రాంతి తీసుకుని విజయవాడ వెళ్లిపోయారు. 

సర్క్యూట్‌ హౌస్‌ జంక్షన్‌లో నిరసన 
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సిరిపురం జంక్షన్‌ నుంచి సర్క్యూట్‌ హౌస్‌ జంక్షన్‌ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేసిన జేఏసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులను పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి.. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ అనేక త్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కును అమ్మే హక్కు మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు