ఏపీ బంద్‌కు అసదుద్దీన్‌ ఓవైసీ సంఘీభావం

5 Mar, 2021 16:08 IST|Sakshi

సాక్షి, కర్నూలు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కార్మికులు చేపడుతున్న బంద్‌కు ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఖండిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదోని పట్టణానికి బయలుదేరిని ఆయన.. మార్గమధ్యంలో కోడుమూరు పట్టణంలో ఆగి అక్కడ శాంతియుతంగా బంద్‌ను పాటిస్తున్న కార్మికులనుద్దేశించి మాట్లాడారు. 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని బయటి వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కేం‍ద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్థావించి, కేంద్రంపై ఒత్తిడి తెస్తానని హామీనిచ్చారు. ఇదిలా ఉండగా ఆదోని మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు రంగంలో నిలిచారు. వీరికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అసదుద్దీన్‌ ఆదోనికి వెళ్లారు. కాగా, పాతబస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం పార్టీ ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు