సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

28 Jan, 2023 15:31 IST|Sakshi

హైదరాబాద్‌: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సాక్షిగా విచారించే క్రమం‍లో సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ఆదేశాల్లో భాగంగా నోటీసులు అందుకున్న అవినాష్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి కేసును సీబీఐ విచారిస్తున్న క్రమంలో విచారణ పారదర్శకంగా జరగాలని అవినాష్‌రెడ్డి కోరుతున్నారు.  ఈ మేరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.

ఇదిలా ఉంచితే,  సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో తాను విచారణకు హాజరవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తూనే.. ఓ వర్గం మీడియా తనపై అసత్య కథనాలు ప్రసారం చేయడాన్ని కూడా ప్రస్తావించారు.  ‘వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది. తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నా’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

‘‘విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి’’ అని సీబీఐని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు