సాయం.. దూరం!

24 Aug, 2020 12:01 IST|Sakshi

జిల్లాకు రాని కేంద్ర ప్రభుత్వ నిధులు

మూడేళ్లుగా ఆగిన ప్రత్యేక అభివృద్ధి పథకం సాయం 

అభివృద్ధిపై ప్రభావం 

రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటేనే మరింత మంచి ఫలితాలు వస్తాయి. చన్నీళ్లకు వేడినీళ్లు తోడన్నట్లు కేంద్రం నిధులు ఇచ్చినపుడే అభివృద్ధి వేగంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొన్ని రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈప్రభావం జిల్లా అభివృద్ధిపైనా పడుతోంది. 

విజయనగరం గంటస్తంభం: పట్టణ, గ్రామాలాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక పథకాలు అమలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. అయితే వీటిలో కొన్నింటిని కేంద్రం నిలుపుదల చేయడం సమస్యగా మారింది.  

ఆగిన ఎస్‌డీపీ.. ఎంపీ లాడ్స్‌ 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా జిల్లాలో కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేక అభివృద్ధి పథకం, పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్‌) ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని విభజన బిల్లులో పొందుపరిచారు. ఇందులో భాగంగా ఏడాదికి ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈమేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు వరుసుగా మూడేళ్లపాటు నిధులు మంజూరు చేసింది. ఒక్కో ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున రూ.150 కోట్లు నిధులు మంజూరయ్యాయి.  2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50 కోట్లు విడుదల చేసినా వెంటనే వెనుక్కి తీసుకుంది. ఈనిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధుల ఊసెత్తలేదు.

2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఆ పథకం ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలని ఈ నిధులను ఆపేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈఏడాది నుంచి ఎంపీ లాడ్స్‌ కూడా ఆగిపోయాయి. ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో ఈఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా ఎంపీ లాడ్స్‌ నిధులు విడుదల చేయమని కేంద్ర  ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఒక్కో ఎంపీకి రెండేళ్లులో రూ.10 కోట్లు నిధులు రావు. దీంతో వారు కేటాయించే పరిస్థితి ఉండదు.  

అభివృద్ధిపై ప్రభావం 
ఈరెండు పథకాలు ఆగడంతో జిల్లా అభివృద్ధిపై ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎస్‌డీపీ నిధులు ఏడాదికి రూ.50 కోట్లు ఇవ్వడం వల్ల సాగునీటి వనరులు అభివృద్ధి, రోడ్లు, కాలువులు, తాగునీటి పథకాల నిర్మాణం, విద్య, వైద్యం తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వీలుంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో సుమారు రూ.200 కోట్లు విలవైన పనులు జరిగాయి. దీంతో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు.

ఈ సమయంలో ఎస్‌డీపీ పథకం ఉంటే ప్రయోజనం ఉండేది. కనీసం ఎంపీలాడ్స్‌ ఉన్నా ఎంతోకొంత అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆస్కారం ఉండేది. గతేడాది ఒక్కో ఎంపీకి రూ.5 కోట్లు ఇవ్వడం వల్ల విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ రూ.3.93 కోట్లుతో 75 పనులు మంజూరు చేశారు. అలాగే అరుకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి తన రూ.5 కోట్లు నుంచి జిల్లాలో పలు పనులకు సుమారు రూ.1.5 కోట్లు ఇచ్చారు. ఎస్‌.కోట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.5 లక్షలు ఇచ్చారు. వీటితో అనేక పనులు చేపట్టడం జరిగింది. రెండేళ్లుపాటు వారికి నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు జరిగేందుకు కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.  

కరోనాతో ఎంపీ నిధులు ఆగాయి 
ఈవిషయం జిల్లా ప్రణాళిక శాఖ అధికారి విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఎంపీ లాడ్స్‌ కరోనా నేపథ్‌యంలో రెండేళ్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్‌డీపీ నిధులు 2018–19 నుంచి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతుంది. వస్తే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి.  

మరిన్ని వార్తలు