అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరాం

23 Sep, 2020 13:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణం, ఫైబర్ నెట్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, అమరావతిపై సీబీఐ దర్యాప్తు, పోలవరం ప్రాజెక్టు నిధులు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దానికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని వెల్లడించారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం కాలిపోయిందనే పేరుతో రాష్ట్రాన్ని కాల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా మత కలహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైలు తగలబెట్టి కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి:(అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ )

అదే విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ద్రోహి అని మండిపడ్డారు. నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. హద్దుమీరి మాట్లాడితే తన బండారం బయట పెడతానని హెచ్చరించారు. తమ నాయకుడిని విమర్శిస్తే ఊరుకోమని, కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే ఎందుకు అంత కడుపుమంట అని నిలదీశారు. మరో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కాఫీ తోటల పెంపకానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులను కలిసి నిధుల కోసం ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు.
చదవండి:(కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ)

మరిన్ని వార్తలు