మన డైనమిక్‌ సీఎం కూడా డిసెంబర్‌లోనే పుట్టారు..

14 Dec, 2020 08:09 IST|Sakshi

రాజమహేంద్రవరాన్ని క్రీడాహబ్‌గా చేస్తామన్న మార్గాని భరత్‌

స్టార్స్‌ అంతా డిసెంబర్‌ నెలలోనే పుడతారని సినీ నటి, ఆర్‌ఎక్స్‌ 100 ఫేం పాయల్‌ రాజ్‌పుత్‌ చమత్కరించారు. మన డైనమిక్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా డిసెంబర్‌లోనే పుట్టారని, తానూ ఇదే నెలలో పుట్టానని ఆమె అన్నారు. ‘అందరూ బాగున్నారా.. అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. కాలేజీ రోజుల్లో క్రికెట్‌ ఆడేదానినని, తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని అన్నారు. రాజమహేంద్రవరం రావడం చాలా అనందంగా ఉందని, ఇక్కడ గోదావరి అందాలు చాలా బాగుంటాయని అన్నారు.
   

సాక్షి, సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): క్రీడల్లో గెలుపోటములు సహజం. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఓటమి గెలుపునకు నాంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కశాళాల క్రీడా ప్రాంగణంలో రాజమహేంద్రవరం ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–4 క్రికెట్‌ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. మంత్రి అనిల్‌ కుమార్, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలపై ప్రత్యేక అభిరుచి ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉండడం  అదృష్టం అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు. క్రీడాకారుల కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

మానసిక ఒత్తిళ్లను అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు క్రీడలను, వ్యాయామాలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ పర్యవేక్షణలో అజ్జరపు వాసు, కుంచే శేఖర్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. క్రీడలు మానసిక, శరీరక వికాసానికి పునాదులని భరత్‌ అన్నారు. ఐక్యతను పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. స్వామి వివేకానంద సూక్తులను అనుసరించి క్రీడాకారులు రాణించి సత్తాను చాటుతూ దేశవ్యాప్తంగా ప్రతిభను చాటుకోవాలన్నారు. ఎక్కవ రకాల క్రీడలను ప్రోత్సహించి ఆయా క్రీడలపై ఆసక్తి గల క్రీడాకారులకు తగిన వేదికల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. 7 రాష్ట్రాల క్రీడాకారులు ఈ సీజన్‌–4లో 24 బృందాలుగా పొల్గొనడం అభినందనీయం అన్నారు.  

రాజమహేంద్రవరం నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తయారు చేస్తానని ఎంపీ భరత్‌ అన్నారు. ఆర్ట్స్‌ కళాశాలలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని దీనిలో 50 శాతం సీఎస్‌ఆర్‌ కింద ఓఎన్‌జీసీ సమకూర్చాలని సభకు హాజరైన ఆ సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు ఆదేశ్‌ కుమార్‌ని ఎంపీ కోరారు. మరో విశిష్ట అతిథి పోలవరం ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ ఈ క్రికెట్‌ మ్యాచ్‌లు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, చందన నాగేశ్వర్, గుబ్బల రాంబాబు, గుర్రం గౌతమ్‌ పాల్గొన్నారు. 


బౌలింగ్‌ చేస్తున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్‌  

 

మరిన్ని వార్తలు