‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం సూత్రధారి లోకేష్‌’

7 Mar, 2023 12:50 IST|Sakshi

ఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం సూత్రధారి నారా లోకేష్‌ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ విమర్శించారు. సిమెంట్స్‌ కంపెనీతో డమ్మీ ఒప్పందం చేసుకుని రూ. 300 కోట్లు ప్రజాధనం మింగేశారని ఎంపీ మార్గాని భరత్‌ మండిపడ్డారు. సెల్‌ కంపెనీల ద్వారా ఈ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ముందు లోకేష్‌ ఒక బచ్చా అని మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు.

అందుకే ఏపీలో అంబానీ, అదానీ పెట్టుబడులు
పారిశ్రామిక ప్రపంచం సీఎం జగన్‌పై పూర్తి విశ్వాసంతో ఉందని,  అందుకే ఏపీలో అంబానీ, అదానీ పెట్టుబడులు పెడుతున్నారని ఎంపీ భరత్‌ తెలిపారు. రూ. 13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు జరగడం ఇదే ప్రథమం అని భరత్‌ స్పష్టం చేశారు.  పోలవరం కాఫర్‌ డ్యాం లేకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఏం చేస్తోందని ప్రశ్నంచిన ఎంపీ భరత్‌.. పెద్ద పొరపాటు చేసిన చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు పెట్టాలన్నారు.

కాగా, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌ (ఏపీఎస్‌  ఎస్‌డీసీ)లో కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీమెన్స్‌ కంపెనీతో ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని కొల్ల­గొట్టిన కేసులో అప్పట్లో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్‌ అర్జాకు సీఐడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌ పేరిట టీడీపీ ప్రభుత్వ పెద్దలు నిధులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయిస్తే సీమెన్స్‌ కంపెనీ 90శాతం నిధులు వెచ్చించి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారని ఒప్పందం చేసుకున్నారు. కానీ సీమెన్స్‌ కంపెనీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించేశారు. వాటిలో రూ.245 కోట్లను డిజైన్‌ టెక్, స్కిల్లర్‌ అనే షెల్‌ కంపెనీల ద్వారా సింగపూర్‌కు మళ్లించి, వాటిని మళ్లీ టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశే ఏపీ ఎస్‌ఎస్‌డీసీ వ్యవహారాలు చూడటం గమనార్హం.

మరిన్ని వార్తలు