విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి: మోపిదేవి

20 Jul, 2021 19:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇన్నాళ్ళు తాము కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని వేచి చూశామని.. ఇక ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి  లేదన్నారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించామన్నారు. ఇచ్చిన డోసుల కంటే అత్యధిక మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను అనేక మార్గాల్లో ప్రభుత్వం ఆదుకుందని వివరించారు. టీడీపీ ఎంపీ.. రాజ్యసభలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మోపిదేవి దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు