అవకాశం వస్తే తెలుగు ప్రజలకు సేవ చేస్తా: నవనీత్‌ కౌర్‌

25 Jun, 2021 13:27 IST|Sakshi

సాక్షి, తిరుమల: తన పోరాటం శివసేన పైనేనని మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్‌ సభ్యురాలు, నటి నవనీత్‌ కౌర్‌ అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కుల ధ్రువీకరణ కేసుపై స్పందించారు. ఓటమిని తట్టుకోలేకే తనపై తప్పుడు కేసు వేశారని ఆరోపించారు. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అంశంపై హైకోర్టులో తనకు చుక్కెదురైనా, సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింద‌ని చెప్పారు. అందుకే తాను ఈ రోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నాన‌ని తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.


అవకాశం వస్తే తెలుగు ప్రజలకు సేవ చేస్తానని ఎంపీ నవనీత్‌ కౌర్‌ అన్నారు. తెలుగు ప్రజల తరుపున లోకసభలో తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని  రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌కు సాయం చేస్తాన‌ని అన్నారు. మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కరంపైనే దృష్టి పెడతానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. కాగా గత లోక్ సభ ఎన్నికల సమయంలో నవనీత్‌కౌర్‌ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. దీంతో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

చదవండి: ఎంపీ నవనీత్‌ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

మరిన్ని వార్తలు