రఘురామకృష్ణరాజు రిమాండ్ పొడిగింపు

16 Jun, 2021 21:14 IST|Sakshi

ఈ నెల 25 వరకు పొడిగిస్తూ సీఐడీ న్యాయస్థానం ఆదేశాలు

సాక్షి, అమరావతి: అసత్య ప్రచారంతో సమాజంలో విద్వేషాలు రేకెత్తించి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్న కేసులో నిందితుడైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామకృష్ణరాజు మళ్లీ గుంటూరు జైలుకు రావల్సిన అనివార్యత ఏర్పడింది. గుండెకు శస్త్ర చికిత్స జరిగినందున రఘురామకృష్ణరాజుకు మే 21న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిబంధనల ప్రకారం ఆయన గుంటూరు జైలుకు వచ్చి బెయిల్‌ పత్రాలపై సంతకం చేసి బెయిల్‌పై విడుదల కావాల్సి ఉంది.

బెయిల్‌ షరతుల ప్రకారం గతనెల 28న రూ.లక్ష విలువైన రెండు ష్యూరిటీలను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించారు. వాటిని అదేరోజున న్యాయస్థానం ఫారం–43తో సహా గుంటూరు జైలుకు పంపించింది. వాటిపై నిందితుడి సంతకం తీసుకుని సమర్పించాలని ఆదేశించింది. అందుకోసం రఘురామకృష్ణరాజు గుంటూరు జైలుకు రావాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. దాంతో రఘురామ సంతకం లేని పత్రాలను గుంటూరు జైలు సూపరింటెండెంట్‌ ఈ నెల 10న సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. బాండ్‌ పత్రాలపై నిందితుడు సంతకం చేయనందున ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయినట్టు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనపై రిమాండ్‌ వారెంట్‌ మనుగడలో ఉన్నట్టుగానే భావిస్తున్నామని కూడా తేల్చిచెప్పింది. కాబట్టి ఎంపీ రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది.   

చదవండి: దొంగ జీవోలు తెచ్చి ఆ భూములు అమ్మారు: విజయసాయిరెడ్డి

మరిన్ని వార్తలు