మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి శిక్ష తప్పదు 

30 Dec, 2021 04:45 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

టీటీడీ కేసును చివరిదాకా నేనే వాదిస్తా: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి 

చంద్రబాబు మెప్పు కోసమే ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు 

పరువు నష్టం దావా కేసు ఫిబ్రవరి 4కి వాయిదా  

తిరుపతి లీగల్‌: మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి పరువుకు భంగం కలిగిస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులపై దాఖలు చేసిన పరువు నష్టం దావాపై టీటీడీ తరఫున వాదించేందుకు బుధవారం ఆయన స్థానిక నాలుగో అదనపు జిల్లా జడ్డి కోర్టులో హాజరయ్యారు. సెక్షన్‌ 32 కింద ప్రత్యేకంగా కేసును వాదిస్తున్నట్లు న్యాయమూర్తికి నివేదించారు. ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం, తదితరులకు రిటన్‌ స్టేట్‌మెంట్‌ దాఖలుకు న్యాయస్థానం 90 రోజులు సమయం ఇచ్చినా స్పందించలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఖర్చుల కింద రూ.200 చెల్లించాలని ఆదేశిస్తూ కేసును న్యాయమూర్తి డిసెంబర్‌ 29కి వాయిదా వేసినా ఇంతవరకూ రిటన్‌ స్టేట్‌మెంట్‌ దాఖలు చేయలేదన్నారు.  

సమాజ హితంతో ముడిపడిన కేసు.. 
ఈ కేసు సమాజ హితంతో ముడిపడి ఉందని వాదనల సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి నివేదించారు. ఈ సమయంలో ఆంధ్రజ్యోతి తరపున జూనియర్‌ న్యాయవాది హాజరై రిటన్‌ స్టేట్‌మెంట్‌ దాఖలు చేస్తామని కోరడంతో జడ్జి సత్యానంద్‌ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అనంతరం ఆంధ్రజ్యోతి తరపు న్యాయవాది మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరై రిటన్‌ స్టేట్‌మెంట్‌ దాఖలు చేశారు. ఖర్చుల కింద  రూ.200 చెల్లించాలని టీటీడీ తరపు న్యాయవాది కోరగా, టీటీడీ తరపున సుబ్రహ్మణ్యస్వామి మాత్రమే వాదనలు వినిపిస్తామని కోర్టు అనుమతి తీసుకున్నందున ఆయనకు మాత్రమే ఇస్తామన్నారు. అయితే ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అప్పటికే కోర్టు నుంచి వెళ్లిపోవడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు నగదును కోర్టులో డిపాజిట్‌ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును న్యాయమూర్తి ఫిబ్రవరి 4వతేదీకి వాయిదా వేశారు.   

టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా.. 
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబర్‌ 1వ తేదీన ‘‘వెంకన్న వెబ్‌సైట్లోకి యేసయ్య‘‘, ‘‘టీటీడీ వెబ్‌సైట్లో అన్యమత ప్రచారం‘‘ శీర్షికలతో కథనాలను ప్రచురించిందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. వాదనలు వినిపించిన తరువాత కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అసత్య కథనాలతో టీæటీడీ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, దీనిపై క్షమాపణలు చెప్పాలని టీటీడీ మూడుసార్లు ఆంధ్రజ్యోతి  యాజమాన్యానికి లీగల్‌ నోటీసులు పంపినా స్పందించలేదన్నారు. ఆంధ్రజ్యోతి పబ్లిషర్‌ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్‌ కె.శ్రీనివాస్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ న్యూస్‌ పేపర్‌ చీఫ్‌ ఎడిటర్లను ప్రతివాదులుగా పేర్కొంటూ రూ.వంద కోట్ల పరిహారం చెల్లించాలని దావా వేసినట్లు తెలిపారు. 

రెచ్చగొట్టేందుకే అసత్య కథనాలు..     
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హిందువుల్లో వ్యతిరేకత రేకెత్తించేందుకు మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రజ్యోతి అసత్య కథనాలను ప్రచురించిందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పుకోసం ఇలాంటి కథనాలు ప్రచురించినట్లు తెలుస్తోందన్నారు. ఈ కథనాలపై పోలీస్‌ దర్యాప్తు అనంతరం శ్రీవారి ఆలయం వద్ద ఎలాంటి శిలువ ఆకారం లేదని ధృవీకరిస్తూ హైకోర్టుకు ఫోటోలను సమర్పించారని తెలిపారు.

ఈ కేసును టీటీడీ తరపున చివరివరకు తానే వాదిస్తానని, మధ్యలో తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వంశపారపర్యం అర్చకత్వంపై రమణ దీక్షితులు గతంలో చేసిన ట్వీట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన ట్విట్టర్‌ ఖాతాలో కోటి మందికిపైగా ఉన్నారని, అన్నీ తాను చూడలేనని చెప్పారు. తనతో నేరుగా సంప్రదిస్తే సలహా ఇస్తానన్నారు. బ్రాహ్మణులే అర్చకత్వం చేయాలని లేదన్నారు. ఇతర కులాలకు చెందిన ఎంతో మంది రుషులు, మహర్షులుగా పేరు ప్రఖ్యాతలు గడించారన్నారు. టీటీడీలో కాగ్‌తో ఆడిట్‌ తనిఖీ జరగాలని కోరుతున్నట్లు చెప్పారు.   

మరిన్ని వార్తలు