ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి

25 Mar, 2021 15:28 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

సాక్షి, ఢిల్లీ: చట్ట సభలు, నామినేటెడ్‌ పదవుల్లోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని గురువారం.. రాజ్యసభలో  వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై సభలో మాట్లాడారు. 1962 లోక్‌సభ ఎన్నికల్లో 46.7 శాతం మంది మహిళా ఓటర్లు పాల్గొనగా, 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి అది 67.18 శాతానికి పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా రాజకీయాల్లో గానీ, చట్టసభల్లో గానీ మహిళల ప్రాతినిధ్యం పెరగలేదని పేర్కొన్నారు. ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం చాలా దిగువన ఉండిపోయిందన్నారు.

1998లో 95వ స్థానంలో ఉన్న భారతదేశం 2021 నాటికి 148వ స్థానానికి పడిపోయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 60 శాతం మంది మహిళలకు మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులు దక్కడం మహిళా ప్రాతినిధ్యం దిశగా వేసిన ముందడగుగా ఆయన అభివర్ణించారు. మొత్తం 86 ఉన్నత పదవుల్లో 52 మహిళలే దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఇదో రికార్డు. మహిళా సాధికారిత దిశగా, పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధికి ఇది ప్రబల తార్కాణమని విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్షా 50 వేల పంచాయతీల్లో 50 శాతం పైగా అంటే 78 వేల పదవులను మహిళలే అలంకరించారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రిజర్వేషన్లు ఎంత అవసరమో దీనినిబట్టి స్పష్టం అవుతోంది. కాబట్టి అన్ని నామినేటెడ్‌ పోస్టులు, చట్ట సభలలో మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్‌ చేస్తూ చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఉంది. ఈ దిశగా చట్టం రూపకల్పనకు కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
చదవండి:
ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు: సీఎం జగన్‌‌
హోదా వద్దు అన్నది చంద్రబాబే 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు