సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహకరం

10 Aug, 2021 04:35 IST|Sakshi

ట్యాక్సేషన్‌ చట్టాల సవరణ బిల్లుపై చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి

బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా తెచ్చిన ట్యాక్సేషన్‌ చట్టాల సవరణ బిల్లు సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రెట్రోస్పెక్టివ్‌ (గత కాలానికి) ట్యాక్స్‌ రద్దుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రతిపాదిత బిల్లు సులభతర వాణిజ్యానికి మరింత ఊతమిచ్చేదిగా ఉన్నందున ఈ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలుకుతోంది. ఈ బిల్లు వల్ల ప్రభుత్వానికి లిటిగేషన్‌ ఖర్చులు కలిసిరావడంతోపాటు విదేశీ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం క్రమేపీ మరింత పాదుకుంటుంది. ఈ చర్య ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుంది.

భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయపన్ను చట్టంలో మళ్లీ ఇలాంటి రెట్రోట్యాక్స్‌ ప్రతిపాదన తీసుకురావద్దు. రెట్రోట్యాక్స్‌ వల్ల ఏర్పడే వివాదాలు ఏళ్లతరబడి న్యాయస్థానాలలో కొనసాగే పరిస్థితిని మళ్లీ కల్పించవద్దు. భారత ఆస్తుల పరోక్ష బదిలీపై వచ్చే కేపిటల్‌ గెయిన్స్‌పై రెట్రోట్యాక్స్‌విధింపు ఆదాయపన్ను చట్టంలోని నిబంధనలకు లోబడి లేదని సవాలుచేస్తూ వొడాఫోన్‌ దాఖలుచేసిన కేసుపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వొడాఫోన్‌ వాదనను సమర్థించింది. దీంతో కోర్టు తీర్పును పక్కన పెడుతూ 2012లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్యాక్సేషన్‌ చట్టానికి సవరణ చేసింది.

విదేశీ పెట్టుబడిదారులు, సంస్థలు అప్పట్లో ఈ సవరణను తీవ్రంగా దుయ్యబట్టినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ఫలితంగా వొడాఫోన్, కెయిర్న్‌ ఎనర్జీ వంటి అనేక సంస్థలు రెట్రోట్యాక్స్‌పై దేశ, అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రెట్రోట్యాక్స్‌ రద్దుచేసే ఈ బిల్లు వల్ల ఏళ్లతరబడి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలను ప్రభుత్వం ఆయా సంస్థలతో సామరస్యంగా పరిష్కరించుకునే వీలు కలుగుతుంది. తాజా బిల్లుతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసం పాదుకుంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది..’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు