బాలికపై ఫిర్యాదుపై అశ్రద్ధ: ఎస్‌ఐ గిరిబాబుపై సస్పెన్షన్ వేటు

22 Jun, 2021 11:12 IST|Sakshi

తిరుపతి క్రైం : ఫిర్యాదిదారులతో అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు పోలీసులను హెచ్చరించారు. ఈ నెల ఆరో తేదీన ఎంఆర్‌పల్లె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక పట్ల దిలీప్‌ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు స్థానిక ఎస్‌ఐ గిరిబాబుకు ఫిర్యాదు చేసినా ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆర్సీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి, దిలీప్‌ను అదేరోజు అరెస్ట్‌ చేయించారు. నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మహిళలు సమస్య అని వస్తే వెంటనే స్పందించండి. చేతనైనంత వరకు న్యాయం చేసి పంపండి’ అని ఆయన సిబ్బందిని ఆదేశించారు.  

వెలుగులోకి రాకుండా..
కేసును సదరు ఎస్‌ఐ  సంబంధిత సీఐ వద్దకు తీసుకెళ్లగా ఆయన తమ పరిధి కాదని, తిరుచానూరు పరిధిలోకి వస్తుందంటూ బాధితులను తిప్పిపంపేశారు. తర్వాత బాధితులను బెదిరించి, నోటికొచ్చినట్టు తిట్టినట్టు సమాచారం. చేసేది లేక బాధితురాలు రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును బయటకు రానీయకుండా ఎమ్మార్‌పల్లి పోలీసులు దాచినట్టు సమాచారం. ఈ కేసులో సీఐపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


చదవండి: ఊగిపోయిన ఉమా.. ఉద్యోగులకు బెదిరింపు

మరిన్ని వార్తలు