Ms శ్రీదేవి.. ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం

17 Feb, 2023 16:58 IST|Sakshi

ఇరవై నాలుగేళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? శ్రీదేవి మాత్రం సమాజ సేవకు సిద్ధపడింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుంది. పేదలతో మమేకమవుతూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తోంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ నేపథ్యమే తనను ఈ దిశగా అడుగులు వేసేలా చేశాయంటున్న శ్రీదేవి.. సేవా కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్న ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం. 

మద్దిపాడు(ప్రకాశం జిల్లా):  Ms శ్రీదేవి. పేరు ఎక్కడో విన్నట్టు.. చూసినట్టు అనిపిస్తోందా? తను సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్‌. నిరుపేదలకు సేవ చేయడంలో కలిగే సంతృప్తిని సమాజానికి పరిచయం చేస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కృప, సత్యనారాయణల మూడో కుమార్తె శ్రీదేవి. తను పుట్టిన మూడు నెలలకే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటే ముందు ఇద్దరు అక్కలు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది తన తల్లి. ఈ క్రమంలో తల్లి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన శ్రీదేవి మనసులో పేదలకు సేవ చేయాలన్న ఆలోచన నాటుకుపోయింది. తన 24వ ఏట నుంచి సేవా కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించింది. 

భర్తను కోల్పోయి చిన్న పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు లేని వృద్ధులు, చదువుపై ఆసక్తి ఉన్నా చదివించే స్థోమత లేని నిస్సహాయ తల్లిదండ్రుల దీనగాథలు ఆమె దృష్టికి రాగానే వెంటనే స్పందించడం, ఆఘమేఘాల మీద ఆ ప్రాంతానికి వెళ్లి సాయం అందించి ఆత్మ సంతృప్తి పొందడం అలవాటుగా చేసుకుంది. గురువారం ఆమె మద్దిపాడు మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీకి వచ్చింది. స్థానిక సర్పంచ్‌ గంగిరెడ్డి ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంది.

కాలనీ పది మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు దుస్తులు, కొంత నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకుంది. ‘నా ఆత్మ సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి నెలా సుమారు రూ.3 లక్షలకు పైగా పేదల కోసం ఖర్చు చేస్తున్నా. చిన్న పిల్లలను చదివిస్తున్నా. నా టీమ్‌లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఏఏ జిల్లాలకు వెళ్లాలో ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం, ఆ తర్వాత గ్రామాలను ఎంచుకుని సహాయం అవసరమైన వారిని గుర్తిస్తాం. 20 మంది బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ అందిస్తూ వారి చదువుల బాధ్యతను కూడా తీసుకున్నా’ అని సంతోషంగా చెప్పింది. శ్రీదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు