బత్తాయి ధరకు భరోసా..  రైతుకు ధిలాసా

3 Mar, 2021 05:34 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని బత్తాయి తోట

దేశంలో తొలిసారిగా బత్తాయికి ఎమ్మెస్పీ

నిరుడు ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో గట్టెక్కిన రైతులు 

ఈసారి ఘనంగా దిగుబడులు.. పెరుగుతున్న ధరలు 

ప్రస్తుతం క్వింటాల్‌ ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలు 

ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు 

ఢిల్లీ అజాద్‌పూర్‌ మార్కెట్‌ నుంచి మొదలైన ఆర్డర్లు

సాక్షి, అమరావతి: ఆంధ్ర బత్తాయి.. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో యమ గిరాకీ. మార్కెట్‌కు వస్తోందంటే చాలు ఎగరేసుకుపోతారు. గతేడాది రికార్డు స్థాయిలో దిగుబడులు రాగా, మార్కెట్‌కు వచ్చే సమయంలో కరోనా దెబ్బతీయడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయడంతో బత్తాయి రైతు గట్టెక్కగలిగాడు. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి రేటు పలుకుతుండడంతో ఈసారి లాభాలను ఆర్జించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బత్తాయి సాగులోనే కాదు.. దిగుబడిలో కూడా మన రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో అనంతపురం, విజయనగరం, వైఎస్సార్, ప్రకాశం, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది. మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే ఉంది.

రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి పండుతోంది. సాధారణంగా ఏడాదికి మూడు పంటల వరకు తీస్తారు. కానీ ఏప్రిల్‌లో వచ్చే పంటకే మంచి డిమాండ్‌ ఉంటుంది. మంచి లాభాలొస్తాయి.అందుకే రైతులు ఎక్కువగా ఆ పంటపైనే ఆశలు పెట్టుకుంటారు. మనరాష్ట్రంలో సాగయ్యే బత్తాయిలో సగానికిపైగా ఢిల్లీ అజాద్‌పూర్‌ మార్కెట్‌ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. మిగిలిన సగంలో మూడొంతులకుపైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు వెళుతుంది. కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే లోకల్‌ మార్కెట్‌కు పోతుంది. మన బత్తాయి టన్ను రూ.లక్ష పలికిన సందర్భాలున్నాయి. 2018–19లో 88,029 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవగా 21.9 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో సాగువిస్తీర్ణం 1,10,970 హెక్టార్లకు చేరగా దిగుబడి రికార్డు స్థాయిలో 26.63  లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చింది.  

నిరుడు ప్రభుత్వ జోక్యంతో గట్టెక్కారు.. 
2019–20లో దిగుబడి ఎక్కువగా ఉన్నా.. పంట మార్కెట్‌కు వచ్చే సమయం (ఏప్రిల్‌)లో కరోనా దెబ్బతీసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లను ప్రకటించింది. ఆ జాబితాలో రాష్ట్రంలో ఎక్కువగా సాగయ్యే బత్తాయి కూడా ఉండడం రైతుకు మేలు చేసింది. గతేడాది మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మార్కెటింగ్‌శాఖ ద్వారా బత్తాయిని టన్ను రూ.10 వేల చొప్పున 4,109 మెట్రిక్‌ టన్నుల బత్తాయిని కొనుగోలు చేసింది. రూ.5 సబ్సిడీ భరించి రైతుబజార్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా విక్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలవల్ల లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత బత్తాయికి మంచి రేటొచ్చింది. టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముకుని రైతులు గట్టెక్కారు. 

ఈ ఏడాది మార్కెట్‌లో మంచి రేటు  
ప్రస్తుతం 95,982 హెక్టార్లలో బత్తాయి సాగులో ఉంది. హెక్టారుకు 24 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంది. పూర్తిస్థాయిలో పంట మార్కెట్‌కు వచ్చే సమయానికి రూ.60 వేలకు పైగా పలికే అవకాశాలుండడంతో మంచి లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మదర్‌ డెయిరీ తమ ఖాతాదారులకు పంపిణీ చేసేందుకు రాయలసీమ జిల్లాల నుంచి రోజుకు ఒక లోడు బత్తాయిని కొనుగోలు చేస్తోంది. మొత్తం బత్తాయి కొనుగోలు చేస్తామంటూ ఆ సంస్థ ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతోంది. మరోపక్క ఢిల్లీ అజాద్‌పూర్‌ మార్కెట్‌ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని రైతులు చెబుతున్నారు. 

దిగుబడులు బాగున్నాయి  
ఈసారి పంట బాగుంది. దిగుబడులు కూడా రికార్డు స్థాయిలోనే వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో టన్ను రూ.40 వేలకుపైగా పలుకుతుండగా, ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం రైతుకు మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నాం. 
– ఎం.వెంకటేశ్వర్లు, జేడీ, హార్టికల్చర్‌ (ఫ్రూట్స్‌ విభాగం) 

>
మరిన్ని వార్తలు