ఎంఎస్‌ఎంఈ మార్ట్‌తో అంతర్జాతీయ లావాదేవీలు

16 Oct, 2020 19:58 IST|Sakshi

కొనుగోలు-అమ్మకాలకు ఆన్‌లైన్‌ వేదిక

ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు తొలి ఏడాది ఉచితం

ఇతర వ్యాపార సంస్థలకు 30 రోజుల ఉచిత ట్రేడింగ్‌  

క్రయవిక్రయాలకు బీటూబీ పోర్టల్‌ను ప్రవేశపెట్టిన ఎన్‌ఎస్‌ఐసీ

రాష్ట్రంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖ

సాక్షి, అమరావతి : సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎంఎస్‌ఎంఈ) వ్యాపార సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ) అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ మార్ట్‌ (msmemart.com) ద్వారా గ్లోబల్‌ బిజినెస్‌ టు బిజినెస్‌ (బీటూబీ) వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. చిన్న వ్యాపార వేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఎంఎస్‌ఎంఈ మార్ట్‌ పోర్టల్‌ గురించి అవగాహన కల్పించండంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వ్యాపారులు ఏడాది పాటు ఈ పోర్టల్‌లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఏడాది పాటు ఉచితంగా సేవలు వినియోగించుకోవచ్చు. ఏడాది తర్వాత కొనసాగితే ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఇతర వ్యాపార సంస్థలకు 30 రోజులు ఉచిత సభ్యత్వాన్ని కల్పిస్తున్నారు. ఈ ఉచిత సభ్యత్వం సమయంలో పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పోర్టల్‌ ద్వారా ప్రయోజనం బాగుందని అనిపిస్తే ఏడాదికి రూ.7,080 (జీఎస్టీతో కలిపి) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంఎస్‌ఎంఈ మార్ట్‌ అందించే సేవలు

 • వరల్డ్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ నేషన్స్‌, ఐఎల్‌వో వంటి అంతర్జాతీయ సంస్థలు టెండర్లలో పాల్గోనే అవకాశం
 • కొనుగోలు/అమ్మకాలకు సంబంధించి ట్రేడ్‌ లీడ్స్‌
 • ఆన్‌లైన్‌లో 24 గంటలు ఉత్పత్తుల ప్రదర్శన
 • ఆన్‌లైన్‌ బయర్స్‌ అండ్‌ సెల్లర్స్‌ మీట్‌.
 • అంతర్జాతీయ ట్రేడ్‌ షో వివరాలు, వాటి ప్రదర్శన
 • పాత మిషనరీ కొనుగోలు, అమ్మకం
 •  యూనిట్ల మెర్జింగ్‌ అండ్‌ అక్విజేషన్స్‌
 •  ఎప్పటికప్పుడు డిస్కౌంట్‌ ఆఫర్స్‌, ధరల వివరాలు
 •  ఫ్రాంచైజీ, డిస్ట్రిబ్యూటర్‌షిప్‌
 • సొంతంగా వెబ్‌ డెవలప్‌మెంట్‌కు టూల్స్‌
 • కొటేషన్స్‌ (ఆసక్తి వ్యక్తీకరణ)లో పాల్గొనే అవకాశం
 • ఎదుటి సంస్థల యాజమాన్యం గురించి తెలుసుకునే అవకాశం.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు