చిన్న పరిశ్రమలతో..పెద్ద ఉపాధి

29 Mar, 2021 02:42 IST|Sakshi

ఎంఎస్‌ఎంఈల్లో రూ.కోటి పెట్టుబడితో 28 మందికి ఉపాధి

అదే పెద్ద పరిశ్రమల్లో కేవలం నలుగురికి మాత్రమే ఉద్యోగాలు

అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14,273 పరిశ్రమలు

సమగ్ర పారిశ్రామిక సర్వేలో ప్రాథమికంగా వెల్లడి

నెల రోజుల్లో పూర్తి కానున్న సర్వే

రాష్ట్రంలోని పరిశ్రమలు 98,327 

ఉద్యోగుల సంఖ్య(లక్షల్లో) 13.95 

ఎంఎస్‌ఎంఈల్లో ఉద్యోగుల సంఖ్య (లక్షల్లో) 9.68 

సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగం తక్కువ పెట్టుబడితో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో కలుపుకొని 13.95 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో ఒక్క ఎంఎస్‌ఎంఈ రంగంలోనే 9,68,448 మంది ఉన్నారు. కోటి రూపాయల పెట్టుబడితో ఎంఎస్‌ఎంఈ రంగంలో 28 మందికి ఉపాధి లభిస్తుండగా, భారీ ప్రాజెక్టుల్లో అయితే ఒకరికి, పెద్ద పరిశ్రమల్లో నలుగురికి ఉపాధి లభిస్తున్నట్లు సమగ్ర పారిశ్రామిక సర్వే ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, వాటికి కావాల్సిన మానవ వనరులు, ఇతర అవసరాలను తెలుసుకొని తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర పారిశ్రామిక సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 98,327 పరిశ్రమలు ఉండగా అందులో ఇప్పటి వరకు 53,945 యూనిట్లలో పూర్తి వివరాలను సేకరించారు. నెల రోజుల్లో మిగిలినవి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

మెగా ఇండస్ట్రీస్‌లో విద్యుత్‌ పరిశ్రమలే అధికం
► రాష్ట్రంలో 98 మెగా ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. వీటి ద్వారా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించింది. ఈ మెగా ఇండస్ట్రీస్‌లో 1,64,755 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా 47 శాతం విద్యుత్‌ రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయి. బేసిక్‌ మెటల్స్‌–అల్లాయిస్‌ 13 శాతం, ఆటోమొబైల్‌ కంపెనీలు 7 శాతం ఉన్నాయి.
► మెగా ఇండస్ట్రీస్‌లో ఉపాధి విషయానికి వస్తే 21 శాతంతో బేసిక్‌ మెటల్స్‌–అల్లాయిస్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత విద్యుత్‌ రంగంలో 13 శాతం, బల్క్‌ డ్రగ్‌–ఫార్మా 12 శాతం, టెక్స్‌టైల్‌లో 11 శాతం మంది పని చేస్తున్నారు. రాష్ట్రంలో 806 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.0.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 2,62,307 మంది పని చేస్తున్నారు. పెట్టుబడుల పరంగా బల్క్‌ డ్రగ్‌ అండ్‌ ఫార్మా 14 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, విద్యుత్‌ 13 శాతం, టెక్స్‌టైల్‌.. బేసిక్‌ మెటల్స్, రసాయనాల రంగాలు 12 శాతం చొప్పున ఉన్నాయి.
► ఎంఎస్‌ఎంఈ రంగంలో 19 శాతం పెట్టుబడులతో ఆగ్రో–ఫుడ్‌ ప్రాసెసింగ్, సేవా రంగాలున్నాయి. సేవారంగం అత్యధికంగా 19 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంటే ఆగ్రో–ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో 17 శాతం మంది, నిర్మాణ రంగ పరికరాల తయారీలో 11 శాతం మంది ఉన్నారు.

42 శాతం కంపెకనీలు రాయలసీమలోనే
► రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలు రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 98,327 పరిశ్రమలు ఉంటే అందులో రాయలసీమ నాలుగు జిల్లాల్లోనే 41,228 యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలో అత్యధికంగా 14,273 యూనిట్లు ఉండటం విశేషం.
► ఆ తర్వాతి స్థానాల్లో 13,281 యూనిట్లతో గుంటూరు జిల్లా, 12,160 యూనిట్లతో చిత్తూరు, 10,535 యూనిట్లతో కర్నూలు జిల్లాలు ఉన్నాయి. విజయనగరంలో అత్యల్పంగా 2,530 పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి.

మరిన్ని వార్తలు