జీడీపీ వృద్ధిలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర 

23 Sep, 2023 04:14 IST|Sakshi

పీఎం గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతం 

ఎంఎస్‌ఎంఈ జాయింట్‌ సెక్రటరీ మెర్సీ ఇపావో  

సాక్షి, విశాఖపట్నం: జీడీపీలో ఎంఎస్‌ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎంఎస్‌ఎంఈ జాయింట్‌ సెక్రటరీ మెర్సీ ఇపావో తెలిపారు. విశాఖలో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌పై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈలు దేశ ఆర్థిక రంగ వృద్ధికి దోహదపడటమే కాక.. ఉపాధికి ముఖ్య వనరులుగా ఉన్నాయని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గిస్తున్నాయని చెప్పారు.

ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతమవుతున్నాయని వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మరింత విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా రుణ పరిధి పెంపు, ఆధునికీకరణకు ప్రోత్సాహం, సాంకేతిక సాయం, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ అవకాశాల మెరుగుదల, మార్కెట్ల విస్తరణ, ఎగుమతుల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.

ఏపీ మారిటైం బోర్డు డెప్యూటీ సీఈవో లెఫ్టినెంట్‌ కమాండర్‌ బీఎం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి, మౌలిక సదుపాయాల విస్తృతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు పెరగడంలో మారిటైం బోర్డు తోడ్పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టుల ద్వారా కొత్తగా పలు పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శ్రావణ్‌ షిప్పింగ్‌ సరీ్వసెస్‌ లిమిటెడ్‌ ఎండీ జి.సాంబశివరావు, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర ఎస్‌ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు