ఇక స్మార్ట్‌టౌన్లకు భూసేకరణ

10 Apr, 2021 03:03 IST|Sakshi

సన్నాహాలు వేగవంతం చేసిన పురపాలక శాఖ

ఎంత భూమి కావాలో ప్రాథమికంగా అంచనా

జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు

భూసేకరణకు మార్గదర్శకాలు జారీ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్‌టౌన్ల భూసేకరణకు పురపాలక శాఖ సమాయత్తమవుతోంది. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను మధ్యతరగతి వర్గాలకు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టును చేపట్టేందుకు పురపాలక శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నిర్వహిస్తున్న డిమాండ్‌ సర్వే అంచనాల ప్రకారం ఎంత భూమి అవసరమవుతుందో ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీంతో అవసరమైన మేర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో స్మార్ట్‌టౌన్లలో స్థలాల కోసం దరఖాస్తుదారుల అర్హతలు, భూసేకరణకు మార్గదర్శకాలతో పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర స్థాయి కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించాకే ఆమోదం
► భూసేకరణకు జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెట్రోపాలిటన్‌ కమిషనర్‌/పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్, సంబంధిత మునిసిపల్‌ కమిషనర్, ఎస్‌ఈ (ప్రజారోగ్య శాఖ), జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. 
► రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌–డైరెక్టర్‌ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని నియమించారు. ఇందులో ఏపీ టిడ్కో ఎండీ, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్, గృహనిర్మాణ సంస్థ వైస్‌ చైర్మన్‌ సభ్యులు. 
► జిల్లాల్లో స్మార్ట్‌టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం జిల్లా కమిటీల బాధ్యత. 
► జిల్లా కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్షిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీలో కనీసం ఇద్దరు సభ్యులు ఆ భూములను ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ భూములు ఉన్నాయో, లేదో నిర్ధారించాలి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించాకే జిల్లా కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియ చేపడతారు. 

మూడు కేటగిరీలుగా ప్లాట్లు
► డిమాండ్‌ అంచనాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్రాల్లో 150 ఎకరాలు/200 ఎకరాలు/250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేస్తారు. 
► మునిసిపాలిటీల్లో 50 ఎకరాలు/100 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేయాలని నిర్ణయించారు. 
► ఇక స్మార్ట్‌టౌన్లలో మూడు కేటగిరీల ప్లాట్లతో లేఅవుట్లు వేస్తారు. 150 చ.గజాల్లో మధ్య ఆదాయ వర్గం (ఎంఐజీ), 200 చ.గజాల్లో ఎంఐజీ–1, 240 చ.గజాల్లో ఎంఐజీ–2 ప్లాట్ల డిజైన్‌ రూపొందించారు.

వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలు
స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఒక కుటుంబం ఒక ప్లాట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

భూసేకరణకు మార్గదర్శకాలు..
► వివాదాస్పదంకాని భూములనే ఎంపిక చేయాలి.
► భూముల ఎంపికలో మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. 
► డిమాండ్‌ ఉన్న ప్రాంతంలో, తగినంత ఎత్తులో ఉన్న భూములకు ప్రాధాన్యమివ్వాలి.
► గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతాల్లోనే ఎంపిక చేయాలి.
► పాఠశాలలు, రవాణా, వైద్య వసతులు అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి.
► మునిసిపాలిటీల్లో అయితే గరిష్టంగా 3 కి.మీ., కార్పొరేషన్లలో అయితే గరిష్టంగా 5 కి.మీ. దూరంలో ఉన్న భూములను ఎంపిక చేయాలి.
► ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన ప్రాంతాలకు సమీపంలో ఉంటే మంచిది. 
► మౌలిక వసతుల కల్పన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ‘జగనన్న కాలనీ’లకు సమీపంలో ఉండేటట్టుగా చూడాలి.
► భవిష్యత్‌లో కూడా విస్తరణకు అవకాశం లేని ప్రాంతాలను ఎంపిక చేయకూడదు.
► ఆ భూములకు అప్రోచ్‌ రోడ్‌ తప్పనిసరిగా ఉండాలి.
► నిర్మాణాలకు అనువుగా లేని నేలలను ఎంపిక చేయకూడదు.
► చెరువులు, ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయొద్దు.
► భూగర్భ జలాలు తగినంతగా ఉండి, తాగునీటి వసతి ఉన్న ప్రాంతంలోని భూములనే ఎంపిక చేయాలి. 

మరిన్ని వార్తలు