AP: పాఠశాల విద్యాశాఖకు మున్సిపల్‌ స్కూళ్లు 

25 Jun, 2022 02:17 IST|Sakshi

పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం 

అకడమిక్, నిర్వహణ వరకు విద్యా శాఖ బాధ్యత 

భవనాలు, ఇతర ఆస్తులపై ఆజమాయిషీ మున్సిపాలిటీలదే 

మొత్తం 12,006 మంది సిబ్బంది విద్యాశాఖ పరిధిలోకి 

టీచర్లకు మరిన్ని ప్రయోజనాలు 

ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఈ మేరకు జీవో 84 ను విడుదల చేశారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల సర్వీసు విషయాలతో సహా పాఠశాలల పరిపాలన బాధ్యతలను ఇకపై పాఠశాల విద్యా శాఖ చేపడుతుంది. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని జిల్లా, మండల పరిషత్‌ స్కూళ్లు, టీచర్ల బాధ్యతలు అప్పగించిన విధంగానే మున్సిపల్‌ స్కూళ్లనూ విద్యాశాఖకు అప్పగించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులతో జెడ్పీ, ఎంపీపీ టీచర్ల సర్వీసుల (ఏకీకృత సర్వీసులు) విలీన ప్రతిపాదన కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో మున్సిపల్‌ టీచర్ల విషయంలోనూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వీసు రూల్సును జారీచేయనుంది. విద్యా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఈ స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది యధాతథంగా కొనసాగుతారు. స్వీపర్లు, ఇతర కంటింజెంటీ సిబ్బందిని పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకుంటుంది. పాఠశాలల  స్థిర, చరాస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే ఉంటాయని జీవోలో స్పష్టం చేశారు. 

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లæ స్కూళ్లలో 13,948 టీచర్‌ పోస్టులుండగా 12,006 మంది పనిచేస్తున్నారు. 1,942 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2000 సంవత్సరం వరకు ఈ పాఠశాలల్లో నియామక ప్రక్రియను మున్సిపల్‌ విభాగమే చూసేది. తరువాత విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)లకు అప్పగించారు. ఇతర విభాగాల టీచర్ల మాదిరిగానే మున్సిపల్‌ టీచర్లు కూడా 010 పద్దు ద్వారా వేతనాలు అందుకుంటున్నారు. 11 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణకు విద్యాధికారుల పోస్టులను ఏర్పాటుచేసి సీనియర్‌ హెడ్మాస్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన వాటిలో నియమించారు. మున్సిపాలిటీలలోని స్కూళ్ల అకడమిక్‌ వ్యవహారాలను చూసేందుకు తాత్కాలికంగా సీనియర్‌ ఉపాద్యాయులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. 

ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్ల పర్యవేక్షణకు ఓ ప్రత్యేక విధానం ఉంది. ఈ విధానం మున్సిపల్‌ స్కూళ్లలో లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. పైగా ప్రజలకు మౌలిక సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలను అమలులో నిరంతరం మునిగిపోయే మున్సిపాలిటీలు కీలకమైన విద్యా వ్యవహారాలపై దృష్టి సారించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ స్కూళ్ల పర్యవేక్షణ, నిర్వహణను విద్యా శాఖకు బదలాయించారు. దీని వల్ల మున్సిపల్‌ టీచర్ల సీనియారిటీకి, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పైగా ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ ఉపాధ్యాయులకు వర్తించే (నోషనల్‌ ఇంక్రిమెంట్లు, పీఎఫ్, పదోన్నతులు, బదిలీలు వంటివి) అన్ని ప్రయోజనాలూ మున్పిపల్‌ టీచర్లకూ అందుతాయని వివరించింది. దీనివల్ల మున్సిపల్‌ టీచర్లకు ఇప్పటికంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. సర్వీసు అంశాలకు రక్షణ కల్పిస్తూ వీటి పర్యవేక్షణను కూడా ఇకపై పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాన్ని పెంపొందిచేలా ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం టీచర్లకు, విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు