ప్రగతి పరుగులు.. ప్రజలకు వసతులు 

3 Mar, 2021 04:31 IST|Sakshi
పాలకొండ పట్టణంలో పేదలకు కేటాయించిన జగనన్న కాలనీ లేఅవుట్‌

శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి వైపు పురపాలికలు 

టీడీపీ పాలనలో కుంటుపడిన ప్రగతి 

అప్పట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయని దుస్థితి  

ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి 

సంక్షేమ పథకాలతో పట్టణ ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి 

ప్రస్తుతం పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలు  

ఫలితాలపై ప్రభావం చూపనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని పట్టణాలు ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయి. ప్రజలకు పెద్దఎత్తున వసతులు సమకూరుతున్నాయి. మరోవైపు వైఎస్‌ జగన్‌ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని పట్టణాల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపడ్డాయి. గత పాలకులు ఏ పనులూ చేయకుండా.. నిధులను మింగేసి మున్సిపాలిటీల పాలిట పాపాల భైరవులుగా మిగిలిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపూ మున్సిపాలిటీల్లో నిధుల స్వాహాపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై చూపలేదు. కేంద్రం నుంచి విడుదలైన నిధులైనా ఖర్చు చేసి పట్టణాల్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస కూడా వారికి కలగలేదు. దీంతో మున్సిపాలిటీల్లో కోట్లాది రూపాయలు మురిగిపోయాయి.

ఇప్పుడా పరిస్థితి లేదు. వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టడమే కాకుండా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి.. అవసరం మేరకు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఫలితంగా నిన్నమొన్నటి వరకు వెనుకబడిన పాలకొండ, రాజాం నగర పంచాయతీలతో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో తాగునీరు, పారిశుధ్య, డంపింగ్‌ యార్డు, రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రస్తుతం విలీన పంచాయతీల సమస్యల కారణంగా శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం మున్సిపాలిటీలు ఎన్నికలు జరగటం లేదు. పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో యథావిధిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమ విజయ సోపానాలుగా వైఎస్సార్‌సీపీ నేతలు భావిస్తుండగా.. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, వైఫల్యాలు ఎక్కడ తమకు చుట్టుకుంటాయోనన్న భయంతో టీడీపీ నేతలు ఉన్నారు. 

కేంద్రానికి తప్పుడు యూసీలిచ్చి.. 
గత పాలనలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఖర్చు పెట్టకుండా తప్పుడు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు సమర్పించిన దాఖలాలున్నాయి. నిధుల వినియోగం కాగితాల్లోనే చూపించారు. క్షేత్రస్థాయిలో ఖర్చు చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు నడుచుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలోని మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం కింద రూ.26,12,25,000 మంజూరు కాగా వాటిలో రూ. 8,59,80,000 మాత్రమే ఖర్చు చేశారు. 342 పనులు చేపట్టాల్సి ఉండగా.. 203 పనులు ప్రారంభించనేలేదు. ఏడు పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు ఆరా తీస్తే అవినీతి బాగోతం చాంతాడంత బయటపడింది. 

పాలకవర్గాలను పని చేయనివ్వలేదు 
అప్పట్లో మున్సిపల్‌ పాలకవర్గాలను సరిగా పని చేయనివ్వలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమ ప్రయోజనాల కోసం ఆటంకాలు కలిగించారు. గ్రూపు రాజకీయాల్లో పాలకవర్గాల మాట చెల్లకుండా చేశారు. అనేక ఇబ్బందులు, ఆంక్షలు పెట్టడంతో కొన్నిచోట్ల పాలకవర్గాలు సైతం ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇచ్ఛాపురంలో వైఎస్సార్‌సీపీ పాలకవర్గాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడతో అక్కడి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్‌ శివాజీ వ్యవహరించారు. రాజాం, పాలకొండ, అమదాలవలసలో కూడా రకరకాల రాజకీయాలతో అభివృద్ధి జరగకుండా చేశారు. 

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 
పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఉద్దానం ఏరియాలో కిడ్నీ సమస్య దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వాలెన్ని వచ్చినా కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం కాలేదు. వైఎస్‌ జగన్‌ మాత్రం అధికారంలోకి రాకముందే కిడ్నీ బాధితుల సమస్యకు మూలాలను అన్వేషించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేశారు. ఇప్పటికీ కిడ్నీ వ్యాధుల నియంత్రణ కోసం రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వరకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ వ్యాధికి ప్రధాన కారణం తాగునీరే కావచ్చనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు.

ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించనున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఖరీదైన మందులను అందుబాటులోకి తెచ్చారు. పాలకొండలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. పాలకొండలోనే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో రూ.58.48 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు చేపట్టారు. రూ.3.26 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద బడులు రూపురేఖలు మారాయి. ఇచ్ఛాపురంలోని 30 పడకల ఆస్పత్రిని 50 పడకలకు ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది.  

మరిన్ని వార్తలు