సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య

29 Aug, 2021 04:08 IST|Sakshi

నరికి చంపిన సమీప బంధువు

ఆస్తి వివాదమే కారణం

స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు?

సత్తెనపల్లి: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను అతి దారుణంగా నరికి చంపిన ఉదంతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్‌లో శనివారం రాత్రి కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్‌ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (30), కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీఓ సీసీగా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రత్యూష గర్భిణి కావడంతో తల్లి వద్ద ఉంటోంది.

శివప్రసాద్‌ మరణానంతరం ఆయన సోదరుడు మధుసూదనరావు కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో సుమారు ఆరు ఎకరాల పొలం శివప్రసాద్‌ పేరుతో ఉంది. అందులో తమకు వాటా ఉందని మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు శనివారం సత్తెనపల్లి వచ్చి పిన్ని పద్మావతి, సోదరి లక్ష్మీ ప్రత్యూషను అతికిరాతకంగా నరికి చంపాడు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్, రూరల్‌ సీఐలు యూ. శోభన్‌బాబు, బి. నరసింహారావు, ఎస్‌ఐ రఘుపతి పరిశీలించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు