టీడీపీ బకాయిలనూ చెల్లిస్తున్నాం

3 May, 2022 04:26 IST|Sakshi

అందుకే ఇప్పటివరకూ ఇబ్బందులు..

ఆ పరిస్థితులను అధిగమిస్తున్నాం

మంత్రి బూడి ముత్యాలనాయుడు

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన బిల్లులను తమ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని.. ఈ కారణంతోనే ఇప్పటివరకూ ఇబ్బందులు వచ్చాయని.. అయినా వాటిని అధిగమించి ఆ బకాయిలు చెల్లిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిధులకు ఎక్కడా ఇబ్బందిలేదని.. శాఖ పరిధిలో చెల్లించాల్సిన బిల్లులన్నింటినీ నెలరోజుల్లో పూర్తిగా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో రూ.వెయ్యి కోట్లు చెల్లించామన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కేటగిరిలో.. గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న వివిధ భవన నిర్మాణ పనులు, రోడ్డు పనులకు సంబంధించి దాదాపు రూ.1,900 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించనున్నామన్నారు. ఈ శాఖ కార్యక్రమాలపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

గ్రామాల్లోని చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ
ఇక చెత్తను సేకరించే ‘క్లాప్‌’ మిత్రలకు పెండింగ్‌లో ఉన్న 3 నెలల గౌరవ వేతనం వెంటనే చెల్లించడంతో పాటు భవిష్యత్‌లో ఏ నెల జీతం ఆ నెలలో చెల్లించనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా.. గ్రామాల్లో సేకరించే చెత్తను వర్మీ కంపోస్టు ఎరువుగా తయారుచేయడం.. లేదంటే ఇతర అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగనన్న కాలనీల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణంతో పాటు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేస్తామన్నారు. మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులనూ చెల్లించాలని ఆదేశాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాక.. గ్రామీణ రోడ్లకు సంబంధించి రూ.83 కోట్ల దాకా బిల్లులు చెల్లించాల్సి ఉండగా, వాటినీ వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. 

ఎవరు ఎవర్ని బాదుతారో చూద్దాం
రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే, వాటి గురించి మాట్లాడకుండా అరకొరగా ఉండే లోపాల గురించే మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు. చంద్రబాబు జనాలను బాదుతాడా, లేదంటే జనమే ఆయనను బాదుతారో చూద్దామన్నారు.  

మరిన్ని వార్తలు