‘మనబడి నాడు–నేడు’కు చేయూతనిస్తాం

20 Mar, 2021 06:14 IST|Sakshi

స్కూళ్లను బాగు చేసే ఈ పథకం చాలా బాగుంది

పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లే పరిస్థితి రావాలి

‘మీట్‌ ది మీడియా కార్యక్రమం’లో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి: నాడు– నేడు’కు నిధులు ఇస్తామని నాబార్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు తెలిపారు. ఈ పథకానికి వచ్చే ఏడాది రూ.2 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. అదేమంత కష్టం కాదన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా రాష్ట్రంలోని పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాబార్డ్‌ చైర్మన్‌ హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన డాక్టర్‌ జీఆర్‌ చింతలతో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) శుక్రవారం విజయవాడలో మీట్‌ ది మీడియా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మనబడి: నాడు – నేడును నాబార్డ్‌ విశేషంగా అధ్యయనం చేసిందన్నారు. ఇప్పటికే రూ.12 వందల కోట్లు ఇచ్చామని చెప్పారు. కూలడానికి సిద్ధంగా ఉన్న స్కూళ్లను బాగు చేసే ఈ పథకం చాలా బాగుందన్నారు. పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లే పరిస్థితి రావాలని చెబుతూ తాను సైతం సర్కార్‌ స్కూళ్లలోనే చదివానని గుర్తు చేసుకున్నారు.

సహకార సంఘాల ఆధునికీకరణకు పెద్దపీట
దేశంలో 95 వేల సహకార సంఘాలను ఆధునికీకరించి మల్టీ సర్వీస్‌ సెంటర్లుగా మార్చనున్నట్టు జీఆర్‌ చింతల తెలిపారు. తొలిదశలో 5 వేల సంఘాలను మల్టీ సర్వీస్‌ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించగా.. అందులో ఇప్పటికే 3,500 సంఘాలకు నిధులు మంజూరు చేశామన్నారు. ఏపీకి రూ.30 వేల కోట్లు, తెలంగాణకు రూ.20 వేల కోట్లు రుణాలు ఇచ్చామని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకట్రావ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి.ఆంజనేయులు, నాబార్డ్‌ రాష్ట్ర శాఖ సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు