చిరుధాన్యాలతోనే విరుగుడు

8 Nov, 2022 05:22 IST|Sakshi

సంపూర్ణ ఆరోగ్యానికి వాటి వినియోగం తక్షణం పెంచాలి

వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాటిని ప్రోత్సహించాలి

సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది.

ఇటీవల రాయచూర్‌లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్‌ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్‌–సవాళ్లు స్టార్టప్‌ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్, రాయచూర్‌ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి.

2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్‌ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది.
 
చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ 

దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది.

ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్‌ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. 

రైతులకు లాభసాటిగా చేయాలి
చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది.

విజయనగరంలో మిల్లెట్స్‌ ఉత్పత్తి కంపెనీ
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిల్లెట్స్‌ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్‌ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది.

మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్‌పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్‌ అనే బ్రాండ్‌ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్‌ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఎఫ్‌పీఓతో కలిసి మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్‌ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది.

చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే..
► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి.
► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి.
► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. 
► అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి.
► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది.
► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి.  
► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్‌ మీడియాను ఉపయోగించాలి.
► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి.
► సాంకేతికత సమస్యలను  పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్‌ పరికరాలను ఏర్పాటుచేయాలి. 

మరిన్ని వార్తలు