వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నాబార్డ్‌ చేయూత!

28 Sep, 2020 03:31 IST|Sakshi

నామమాత్రపు వడ్డీకి రూ.3,321 కోట్ల రుణం

తొలి విడత రూ.1,250 కోట్ల విడుదలకు అంగీకారం

గోడౌన్లు, కోల్డ్‌ రూమ్‌లు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్ల నిర్మాణాలు ఇక షురూ

నిర్మాణాలకు ఉచితంగా స్థలం ఇవ్వనున్న సర్కార్‌

నేడు అధికారుల సమావేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నాబార్డ్‌ చేయూతను అందిస్తోంది. రైతులకు విత్తనాలు మొదలు అన్ని రకాల సేవలు అందిస్తున్న వీటిని మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం రూ.3,321 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. 

► సంఘాల ఆధ్వర్యంలో గోడౌన్లు, కోల్డ్‌ రూములు, కలెక్షన్‌ సెంటర్లు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలతోపాటు సంఘాలకు అదనపు ఆదాయం లభిస్తుంది.  
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని సమగ్ర నివేదికలను అధికారుల ద్వారా నాబార్డ్‌ చైర్మన్‌ చింతల గోవిందరాజులుకు అందే ఏర్పాటు చేశారు. 
► ఈ ప్రతిపాదనలకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతోపాటు తొలి విడత రూ.1,250 కోట్ల విడుదలకు అంగీకరించారు. 
► మరే రాష్ట్రంలో లేని విధంగా నామమాత్రపు వడ్డీకి ఈ రుణం లభించనుంది. నాలుగు శాతం వడ్డీకి రుణం ఇస్తున్నప్పటికీ సకాలంలో చెల్లిస్తే మూడు శాతం రాయితీ ఇవ్వడానికి నాబార్డ్‌ అంగీకరించింది. దీంతో కేవలం 1 శాతం వడ్డీతోనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రుణం పొందనున్నాయి.

సహకార సంఘాలను పటిష్టం చేయడానికే..
► రాష్ట్రంలో 2,043 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉంటే.. వీటిలో 800 నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 
► ఈ సంఘాలు రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించలేకపోతున్నాయి. అదే విధంగా రుణాలను కూడా ఇవ్వలేకపోతున్నాయి. 
► వీటితోపాటు మిగిలిన సంఘాలను ఆర్థికంగా పటిష్టపరిచి రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం రెండు నెలల క్రితం రూ.3,321 కోట్లకు డీపీఆర్‌లను రూపొందించింది. 
► ఇందులో గోడౌన్ల నిర్మాణాలకు రూ.1,893 కోట్లు, పంటలను ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలకు రూ.207 కోట్లు, పీపీసీ ఎక్విప్‌మెంట్, డయ్యర్లు తదితర యాంత్రిక పరికరాలకు రూ.1,009 కోట్లు, ప్రొక్యూర్‌మెంట్, ఈ–ప్లాట్‌ఫామ్‌లకు రూ.212 కోట్లను కేటాయించింది. 
► నాబార్డ్‌ రుణం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఆసక్తి, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంఘాలు.. గోడౌన్లు, కోల్డ్‌ స్టోర్‌ రూమ్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తే, వాటికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
► సోమవారం ఇదే అంశంపై చర్చలు జరపడానికి సహకార, మార్కెటింగ్, నాబార్డ్‌ అధికారులు సమావేశం కానున్నారు.  

మరిన్ని వార్తలు