Nadu Nedu: బడి భలేగుంది

22 Jul, 2021 02:31 IST|Sakshi
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లిలోని ఎంపీయూపీ స్కూల్‌ ప్రాంగణం ఇది.. పచ్చని తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తోంది.. రెండేళ్ల క్రితం వరకు ఇక్కడ అన్నీ సమస్యలే.. ఇప్పుడు ఇక్కడ లేని వసతి ఏదో చెప్పలేమన్నట్లు సుందరంగా ముస్తాబైంది.

ముచ్చట గొలిపేలా విద్యాలయాలు

ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తికావచ్చిన తొలివిడత నాడు–నేడు

రూ.3,360 కోట్లతో 15,716 స్కూళ్లలో అభివృద్ధి పనులు  

దాదాపు 97 శాతం పనులు పూర్తి

ఆగస్టులో స్కూళ్లకు పిల్లలు వచ్చే నాటికి మొత్తం పనుల పూర్తికి ఏర్పాట్లు 

మౌలిక సదుపాయాలకు పెద్దపీట

అగ్రస్థానంలో ప్రకాశం, విజయనగరం, కృష్ణా, వైఎస్సార్, పశ్చిమ గోదావరి 

వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో పనులు

నాణ్యతలో రాజీ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు 

నాడు 
► ముళ్లకంపలు.. పరిసరాల్లో పందులు, కుక్కల విహారం.. విరిగిపోయిన తలుపులు.. పాడైపోయిన టీవీ.. పగుళ్లిచ్చిన గోడలు, పెచ్చులూడి బూజు పట్టిన శ్లాబ్‌.. పని చేయని ట్యూబ్‌ లైట్‌.. నీళ్లు, తలుపులు లేని టాయిలెట్‌.. ఇంటర్వెల్‌లో ఇంటికి పరుగెత్తే అమ్మాయిలు.. కిర్రు కిర్రుమని శబ్దం చేసే అయ్యవారు కుర్చీ.. ఇలా ఒకటా.. రెండా.. ప్రభుత్వ స్కూళ్లలో మొన్నటి దాకా అన్నీ సమస్యలే.

నేడు 
► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ మొదలైంది.. పది పన్నెండు రకాల వసతుల కల్పనతో ఇప్పుడవి కళకళలాడుతున్నాయి. బాల బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించారు. నిరంతరం నీరు, విద్యుత్‌ సరఫరా ఉంటోంది. చూడచక్కని రంగులతో అల్లంత దూరం నుంచే ఆకట్టుకుంటున్నాయి. కార్పొరేట్‌ విద్యా సంస్థలను మరిపించేలా ముస్తాబయ్యాయి. ‘అది మా ఊరి సర్కారు బడి’ అని సగర్వంగా చెప్పుకునేలా రూపురేఖలు మార్చుకున్నాయి. 

నాడు
 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడప నగరం జయనగర్‌కాలనీలోని బాలికల హైస్కూల్‌కు రెండేళ్ల క్రితం వరకు ఓ మోస్తరు వర్షం వచ్చినా సెలవు ఇచ్చేవారు. ఏకంగా తరగతి గదుల్లోకి వర్షం నీరు వచ్చేది. 450 మందికి పైగా బాలికలు ఉన్న ఈ పాఠశాలలో కేవలం రెండు బాత్‌రూమ్‌లు మాత్రమే ఉండేవి. ఇంటర్వెల్‌లో పిల్లలు క్యూకట్టేవారు. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం వస్తుందనే భయంతో చాలా మంది తక్కువగా తాగేవారు. ఒక్క పదవ తరగతి మినహా మిగతా తరగతుల వారందరూ కింద కూర్చొని విద్యనభ్యసించేవారు. వేసవిలో అయితే ఉక్కపోతతో పిల్లలు విలవిల్లాడిపోయేవారు. ఒక్క ఫ్యాన్‌ కూడా ఉండేది కాదు. ప్రహరీ ఉండేది కాదు. టీవీ ఒకటి ఉందనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులుండేవి కాదు. ప్రహరీ లేనందున రాత్రిళ్లు ఆకతాయిలకు నిలయంగా ఉండేది. ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఈ పాఠశాల రూపురేఖలు ‘నాడు–నేడు’తో ఈ ఏడాది పూర్తిగా మారిపోయాయి. వర్షం నీరు లోపలకు రాకుండా మట్టి తోలించి సరిచేశారు. రూ.25,91,562తో ఎనిమిది టాయిలెట్లను తీర్చిదిద్దారు. రూ.43,20,753తో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15,19,094తో అందరికీ çఫర్నిచర్‌ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.1,09,97,028 నిధులతో తాగునీరు, ప్రహరీ, విద్యుత్, రంగులు, ల్యాబ్, అదనపు గదులు, ఇతరత్రా సౌకర్యాలన్నీ కల్పించారు. ఇలా ప్రతి ఊళ్లోనూ ప్రభుత్వ స్కూళ్లు సర్వాంగ సుందరంగా మారిపోతున్నాయి.   
రాజమహేంద్రవరం సీతంపేటలోని ప్రభుత్వ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆట వస్తువులు 

ప్రత్యక్ష తరగతుల నాటికి పనులు పూర్తి 
రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ తొలి దశ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆగస్టు 16 నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని భావిస్తున్నందున ఆలోగా మొత్తం పనులు పూర్తి చేసేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 97 శాతం పనులు పూర్తి చేసిన అధికారులు మిగిలిన పనులను నిర్ణీత కాలానికన్నా ముందే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా తమ అభ్యసనం సాగించేలా స్కూళ్లను తీర్చిదిద్దారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ము కాసిన గత ప్రభుత్వం.. వేలాది పాఠశాలలను మూత వేయించడమే కాకుండా తక్కిన వాటిని కూడా నిర్వీర్యం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌ తొలి ప్రాధాన్యంగా విద్యా రంగంపై దృష్టి సారించారు. అధ్వాన దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది, పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో చదువులు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. 

తుది దశలో పనులు 
► రాష్ట్రంలో 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో విద్యార్థులు, టీచర్లకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. మూడు దశల్లో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు.  
► తొలిదశలో 15,716 స్కూళ్లలో 1,14,903 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.3,360 కోట్ల ఖర్చుతో 1,11,770 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కూడా చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. రంగులు వేయడం వంటి పనులు మిగిలి ఉన్నాయి. వీటిని స్కూళ్లు తెరవడానికి ముందుగానే పూర్తయ్యేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 4,171 స్కూళ్లకు ప్రహరీలను కూడా నిర్మించారు.  
► ఈ పనులు త్వరితగతిన చేపడుతున్న జిల్లాలకు విద్యా శాఖ ర్యాంకులను ఇస్తోంది. ర్యాంకుల అగ్రస్థానంలో 1 నుంచి 5వ ర్యాంకు వరకు ప్రకాశం, కృష్ణా, వైఎస్సార్, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా.. చివరి మూడు స్థానాల్లో వరుసగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి.  
► నాణ్యతలో రాజీ లేకుండా పనులను చేయించారు. మరుగుదొడ్లలో వాడే పరికరాలు, మంచినీటి సరఫరా పరికరాలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు వంటివన్నీ బ్రాండెడ్‌ వస్తువులను అమరుస్తున్నారు.  
► నిర్మాణ పనుల్లోనూ పది కాలాల పాటు నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్తమ కంపెనీల టైల్స్, గ్రానైట్‌ వంటివి వినియోగించి పాఠశాలలకు కొత్త అందాలను సమకూర్చారు. 

చదువుల లక్ష్యం నెరవేరేలా సదుపాయాలు  
► పాఠశాలలను విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన జ్ఞానాన్ని అందించే పవిత్ర దేవాలయాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా పాఠశాలల్లో చదువులకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.  
► రన్నింగ్‌ వాటర్‌ కలిగిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్‌.. మైనర్‌ రిపేర్లు, పెయింటింగ్‌.. ఫినిషింగ్, స్కూలు విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు, టీచర్లతో సహా పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, కాంపౌండ్‌ వాల్స్, కిచెన్‌ షెడ్లు, డైనింగ్‌ హాళ్లు.. తదితర వసతులను కల్పిస్తోంది.  
► వివిధ యాజమాన్యాల స్కూళ్లు ఉండడంతో పాటు, వేలాది స్కూళ్లలో లక్షల్లో పనులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పలు శాఖల ఇంజనీరింగ్‌ విభాగాలను భాగస్వాములను చేసింది. 

రెండో విడత పనులకు అనుమతులు 
మొదటి విడత పనులు దాదాపు పూర్తి కావస్తుండడంతో రెండో విడత నాడు–నేడు పనులకు విద్యా శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ దశలో 16,345 స్కూళ్లలో రూ.4,446 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్చి 30వ తేదీన పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. రెండో విడతలో 12,678 స్కూళ్లు, 1,668 ప్రభుత్వ హాస్టళ్లు, 473 జూనియర్‌ కాలేజీలు, 17 డైట్‌ సంబంధిత విద్యా సంస్థలు, 391 గురుకుల రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 672 మండల రిసోర్సు కేంద్రాలు, 446 భవిత సెంటర్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈసారి కిచెన్‌ షెడ్లు, స్కూళ్ల ప్రహరీలు, అదనపు తరగతి గదులను కూడా నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. హాస్టళ్లలో ఫర్నిచర్‌ కింద విద్యార్థులకు మంచాలు, పరుపులు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు, అల్మారాలు తదితరాలను సమకూర్చనున్నారు. జూనియర్‌ కాలేజీల్లో ల్యాబ్‌ పరికరాలు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్టులో ఈ విద్యా సంస్థలను ఆహ్లాదకరంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. 
విశాఖ జిల్లా గిడిజాల గ్రామంలోని పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు 

నమ్మలేకపోతున్నా..
మా ఊరిలో విరిగిపోయిన పెంకులు, పగిలిన గచ్చులతో ఉండే పాఠశాల నేడు పెద్ద ఆఫీసు మాదిరిగా మారింది. మొన్నామధ్య అటుగా వెళ్లిన నేను పాఠశాలను చూసి ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు నేను చదువుకున్న పాఠశాల ఇదేనా.. ఇప్పుడు ఎంత అందంగా, అద్భుతంగా ఉందనిపించింది. నిజంగా సీఎం జగన్‌కు ఓ విద్యార్థి తల్లిగా వందనం చేస్తున్నా. ఇటువంటి ఆధునిక భవనాలలో ప్రశాంత వాతావరణంలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ వాతావరణం విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.– చోడి పార్వతి, వండవ, వీరఘట్టం మండలం, శ్రీకాకుళం

ప్రైవేట్‌ స్కూల్‌ కంటే బావుంది
మా ఊళ్లోని స్కూల్లో నా కుమారుడు రిçశ్వంత్‌ చదువుతున్నాడు. గతంలో స్కూల్లో బాత్రూములు, తాగునీరు, కరెంట్‌ లాంటివేమీ లేవు. ఇప్పుడు జగనన్న వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. ఆడ పిల్లలకు, మగ పిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లు వచ్చాయి. ఆర్‌ఓ ప్లాంట్‌ పెట్టారు. స్కూల్లో బల్లలు, ఫ్యాన్లు, బల్బులు వంటివి ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూల్‌ కంటే మంచి వాతావరణం కనిపిస్తోంది.
– నాగరాణి, పాపానాయుడుపేట, ఏర్పేడు మండలం, చిత్తూరు 

మా స్కూల్‌ ఇప్పుడు చాలా బావుంది
మా స్కూళ్లో ఇదివరకు బాతు రూమ్‌ ఉన్నప్పటికీ శుభ్రంగా ఉండేది కాదు. డోర్లు ఊడిపోయి, విరిగిపోయి ఉండేవి. నాడు–నేడు పథకం కింద బాత్‌ రూములు చాలా బాగా కట్టించారు. టైల్స్, వెస్ట్రన్‌ మోడల్‌ కమోడ్, ట్యాపులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నీటి సౌకర్యం కూడా ఉంది. కొత్త బెంచీలు వేశారు. ఇప్పుడు మా స్కూల్‌ చాలా బాగుంది.
– కర్రి శ్యామ్యూల్, 9వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆకివీడు, పశ్చిమగోదావరి  

మరిన్ని వార్తలు