ప్రకాష్‌ను చంపేందుకు స్వామిజీతో కలిసి నాగమణి స్కెచ్‌.. క్షుద్రపూజలు!

19 Jan, 2023 10:16 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్‌ వెల్లడించారు.  

ఏం జరిగిందంటే..  
నల్లమాడ పోలీసు సర్కిల్‌ పరిధిలోని వంకరకుంట గ్రామానికి చెందిన రైతు వెంకటాద్రి పొలంలో గుప్త నిధుల కోసం ఈ నెల 14న కొందరు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై రైతు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు అప్పట్లో నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ యశ్వంత్‌ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.  

పట్టుబడింది వీరే..  
గుప్త నిధుల తవ్వకాల కేసులో పట్టుబడిన వారిలో ఖమ్మం నివాసి నిజాముద్దీన్, నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన శివశంకరరెడ్డి, నరేంద్ర రెడ్డి, హైదరాబాద్‌ నివాసి శ్రీనివాసులు, పుట్టపర్తికి చెందిన విజయ్, తమిళనాడుకు చెందిన చాంద్‌బాషా, మురుగన్, సురేష్‌, అనంతపురానికి చెందిన ఏఆర్‌ మాజీ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ భార్య నాగమణి ఉన్నారు. వీరి నుంచి గుప్త నిధుల తవ్వకానికి వినియోగించిన ఇనుపరాడ్లు, బండను తొలగించేందుకు ఉపయోగించే 20/30 పౌడర్, పూజకు వినియోగించిన ముడుపు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.  

హత్య కుట్ర వెలుగులోకి  
పట్టుబడిన నిందితులను విచారణ చేయడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌ మాజీ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్‌, నాగమణి దంపతులు. ప్రకాష్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడమే కాక, వేధింపులకు గురి చేస్తుండడంతో ఖమ్మంకు చెందిన  నిజాముద్దీన్‌తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. దీంతో తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అనంతపురం పోలీసులకు బదిలీ చేశారు. కాగా, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నిరంజన్‌రెడ్డి, నల్లమాడ, ఓడీసీ, బుక్కపట్నం, అమడగూరు ఎస్‌ఐలు వలీబాషా, గోపీకుమార్, నరసింహుడు, వెంకటరమణ, సర్కిల్‌ సిబ్బందిని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ అభినందించారు.     

మరిన్ని వార్తలు